కేంద్రమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ కు అచ్చెన్నాయుడి విజ్ఞప్తి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లా తోతాపూరి మామిడిని పండించిన‌ రైతుల‌కు కేంద్ర ప్ర‌భుత్వం అండ‌గా నిల‌బ‌డాల‌ని కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహ‌న్ కు ఏపీ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు. మంగ‌ళ‌వారం ఢీల్లీలోని కేంద్ర మంత్రి కార్యాల‌యంలో మంత్రి అచ్చెన్నాయుడు కేంద్ర మంత్రి కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడుతో క‌ల‌సి భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో రైతుల సమస్యలపై కేంద్ర మంత్రితో అచ్చెన్నాయుడు చ‌ర్చించారు. వ్య‌వ‌సాయ రంగ స‌మ‌గ్ర అభివృద్ధికి సంపూర్ణ స‌హ‌కారం అందించాల‌ని కేంద్ర మంత్రిని కోరారు. ముఖ్యంగా రాష్ట్రంలో తోతాపురి మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర మంత్రికి వివ‌రించారు. 6.5 లక్షల మెట్రిక్ టన్నుల తొతాపురి మామిడి పంట కొనుగోలు చేయాల్సి ఉంటుందని కేంద్ర మంత్రికి అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.260 కోట్లు ఖర్చు చేస్తుందని కేంద్ర ప్ర‌భుత్వం త‌గిన తోడ్పాటును అంద‌చేయాల‌ని కోరారు. మార్కెట్ మద్దతు పథకం క్రింద తొతాపూరి మామిడిపండ్లను ఫ్యాక్టరీలు లేదా వ్యాపారుల ద్వారా ప్రతి కిలో రూ.12 ఇందులో రూ.8 ను ఫ్యాక్టరీలు, వ్యాపారులు చెల్లించగా, మిగిలిన రూ.4 ను రైతుల ప్రయోజనార్థం ప్రభుత్వం భరించనుందని, ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం నిధులు అందించాల‌ని కేంద్ర మంత్రిని కోరారు. అలాగే వెనుకబడిన జిల్లాల కోసం మైక్రో ఇరిగేషన్ పథకానికి రాయితీ పెంచాల‌ని కోరారు. ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లోని బుందేల్‍ఖండ్ తరహాలో ఏపీకి కేంద్రం అదనపు సాయం చేయాలన్నారు. గుంటూరులో చిల్లీ బోర్డ్, శ్రీకాకుళంలో జీడిప‌ప్పు బోర్డ్, చిత్తూరు లో మామిడి బోర్డ్ ల‌ను ఏర్పాటు చేస్తే రైతుల‌కు ఎంతో ప్ర‌యోజ‌న‌ం కలుగుతుందని వివ‌రించారు. విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం శ్రీకాకుళం జిల్లాలో కేంద్ర అగ్రికల్చర్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని కేంద్రం మంత్రి శివరాజ్‌ సింగ చౌహాన్‌ ని మంత్రి అచ్చెన్నాయుడు కోరారు.

Updated On 9 July 2025 11:56 AM IST
Politent News Web 1

Politent News Web 1

Next Story