CM Chandrababu: డీలిమిటేషన్ బిల్లుపై చారిత్రక ఘట్టంలో సరైన వైపు నిలవండి: సీఎం చంద్రబాబు ప్రతిపక్షాలకు పిలుపు
ప్రతిపక్షాలకు పిలుపు

CM Chandrababu: డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్లపై ప్రతిపక్ష పార్టీలు సరైన వైపు నిలవాలని, లేనిపక్షంలో చరిత్రహీనులవుతారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. నవంబర్ 30 నుంచి ప్రారంభం కాబోయే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో చట్టసభల సీట్లను 50 శాతం పెంచి 2029 ఎన్నికల నుంచే 33 శాతం మహిళా రిజర్వేషన్లు అమలు చేసే బిల్లును ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆయన ఈ విజ్ఞప్తి చేశారు. దిల్లీలో కేంద్ర మంత్రి, జేడీఎస్ అగ్రనేత హెచ్డీ కుమారస్వామితో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
“ఇప్పుడు మనం చరిత్ర సృష్టించబోతున్నాం. అందువల్ల చరిత్రలో ఎవ్వరూ తప్పు వైపు ఉండొద్దు. అన్ని రాజకీయ పార్టీలు, నాయకులంతా సరైన దిశలో నిలవాలి. మూడు దశాబ్దాల మహిళల ఆకాంక్షలను నెరవేరుస్తున్నందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అభినందనలు. 50 శాతం సీట్ల పెంపు ద్వారా ఒకవైపు మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అమలుతో పాటు, లోక్సభలో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గకుండా కాపాడుతున్నారు. అందువల్ల ఈ చారిత్రక బిల్లులకు మద్దతు పలకాలి” అని చంద్రబాబు పేర్కొన్నారు.
కేంద్రం దేశవ్యాప్తంగా లోక్సభ, అసెంబ్లీ సీట్లను 50 శాతం పెంచనుంది. జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయనే భయం ఉంది. సంతాన నిష్పత్తి దక్షిణాదిలో 1.6కి పడిపోయింది. ఈ పరిస్థితుల్లో 50 శాతం పెంపు ద్వారా ప్రస్తుత నిష్పత్తి కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 25 లోక్సభ స్థానాలు ఉండగా, అవి 38కి పెరుగుతాయి. తమిళనాడు 39 నుంచి 59, కర్ణాటక 28 నుంచి 42, తెలంగాణ 17 నుంచి 26, కేరళ 20 నుంచి 30కి చేరుతాయి. ఐదు దక్షిణాది రాష్ట్రాల కలిపి 129 నుంచి 195 సీట్లకు పెరుగుతాయి. మొత్తం పార్లమెంటరీ ప్రాతినిధ్యంలో వాటి వాటా యథాతథంగా ఉంటుంది.
1976 తర్వాత 2001లో వాజ్పేయి హయాంలో చివరిసారి డీలిమిటేషన్ జరిగింది. అప్పుడు జనాభా ప్రకారం పునర్విభజన చేస్తే దక్షిణాది నష్టపోతుందని చంద్రబాబు అభిప్రాయం చెప్పగా, 1971 జనాభా లెక్కల ప్రకారం సీట్లను మరో 25 ఏళ్లు స్తంభింపజేశారు. ఇప్పుడు 50 శాతం పెంపుతో అందరికీ మేలు చేసే విధానం వస్తోంది. 2024లో లోక్సభలో మహిళలు 13.6 శాతం ఉండగా, 2029లో 33 శాతానికి పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 60 శాతం రిజర్వేషన్లు అమలు చేశామని, పదిమంది మేయర్లలో ఎనిమిదిమంది మహిళలేనని ఆయన గుర్తు చేశారు.
1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో దేవేగౌడ మహిళా బిల్లును ప్రవేశపెట్టారు. వాజ్పేయి నాలుగుసార్లు ప్రయత్నించారు. మన్మోహన్ హయాంలో పెండింగ్లో పడిపోయింది. 2023లో మోదీ బిల్లును ప్రవేశపెట్టి ఉభయసభల ఆమోదం పొందేలా చేశారు. ఇప్పుడు డీలిమిటేషన్ చేసి 2029లోనే అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దేశం గెలవాలంటే జనాభాలో 50 శాతం ఉన్న మహిళలను గౌరవించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. పార్టీలన్నీ ముక్తకంఠంతో మద్దతు పలకాలని, గతంలో అడ్డుపడినట్లు ఇప్పుడు చేస్తే మహిళలు క్షమించరని హెచ్చరించారు. కుమారస్వామి కూడా కాంగ్రెస్తో సహా అన్ని పార్టీలు బిల్లుకు మద్దతివ్వాలని కోరారు.

