Jana Sena Party: రాష్ట్రవ్యాప్తంగా జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

పవన్ కల్యాణ్ పిలుపు: జిల్లాలు, మండలాలు, పంచాయతీల్లో ఘనంగా నిర్వహణ
Jana Sena Party: జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మార్చి 14న రాష్ట్రమంతటా ఘనంగా జరుపాలని పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ఉమ్మడి జిల్లా కేంద్రాలతో పాటు మండల కేంద్రాలు, నగరాలు, గ్రామ పంచాయతీల్లో కూడా విస్తృతంగా వేడుకలు నిర్వహించాలని ఆయన సూచించారు.
పార్టీ జెండాను జనసైనికులు, వీరమహిళలు, నాయకులు, సభ్యుల సమక్షంలో ఎగురవేయాలని ఆదేశించారు. జనసేన సైద్ధాంతిక బలంతో రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ముందుకు సాగుతున్న విధానాన్ని పార్టీ శ్రేణులకు, ప్రజలకు వివరించాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరాలు, ఆహార వితరణ, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.
మొదట్లో పిఠాపురంలో రాష్ట్ర స్థాయి వేడుకలు నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ, వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉండే అవకాశం ఉందనే నివేదికలను పరిగణనలోకి తీసుకుని ఆ నిర్ణయాన్ని మార్చారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వివిధ స్థాయిల్లో వేడుకలు నిర్వహించేందుకు పార్టీ నిర్ణయించింది.
అదే సమయంలో, జనసేన ఉద్యమ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మార్చి 17 వరకు పొడిగించాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ఫిబ్రవరి 26న ప్రారంభమైన ఈ కార్యక్రమం మొదట మార్చి 10 వరకు నిర్వహించాలని ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన విజ్ఞప్తులు, ఎమ్మెల్యేల అభ్యర్థనల మేరకు గడువును మార్చి 17 వరకు పొడిగించారు.
జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పార్టీని మరింత బలోపేతం చేయాలని పవన్ కల్యాణ్ కోరారు.

