Steel Plant Accident: రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (RINL) ఆధ్వర్యంలోని విశాఖ స్టీల్ ప్లాంట్‌లో సోమవారం (జూన్ 8, 2026) భారీ ప్రమాదం సంభవించింది. SMS-1 విభాగంలో లాడిల్ నుంచి మోల్టెన్ మెటల్ (ద్రవీభవించిన ఉక్కు) కారిపోయి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను గుర్తించే పని కొనసాగుతోంది. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక అధికారులు, అగ్ని మండలి సిబ్బంది స్థలానికి చేరుకొని కార్యకలాపాలు చేపట్టారు. రెస్క్యూ ఆపరేషన్లు జరుగుతున్నాయి. ప్రమాద కారణాలను పరిశీలించడానికి ఉన్నత స్థాయి విచారణ కమిటీని నియమించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

సీఎం చంద్రబాబు, అనిత స్పందన:

ఈ దుర్ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేస్తూ, "విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదం నన్ను బాధపెట్టింది. పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. సంబంధిత అధికారులతో మాట్లాడి రెస్క్యూ, రిలీఫ్ చర్యలు తీసుకోవాలని ఆదేశించాను" అని తెలిపారు. జిల్లా అధికారులు, ప్లాంట్ అధికారులతో ఫోన్ ద్వారా సమీక్ష చేశారు.

హోమ్ మంత్రి వంగలపూడి అనిత విజయనగరం జిల్లాలో పర్యటనలో ఉండగా ప్రమాద వార్త తెలియగానే కార్యక్రమాలు మధ్యలో ముగించి విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ర్యాష్ అయ్యారు. మార్గమధ్యంలోనే జిల్లా కలెక్టర్, పోలీసు కమిషనర్‌లతో మాట్లాపడి గాయపడిన వారికి ఉత్తమ చికిత్స అందించాలని, రెస్క్యూ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.

ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ దుర్ఘటనపై సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు సహాయం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని సహాయ చర్యలు చేపట్టింది. ఈ ప్రమాదం కార్మికుల భద్రతపై మరింత శ్రద్ధ వహించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story