Home Minister Vangalapudi Anitha: ఎన్డీఏ ప్రభుత్వం రెండేళ్ల పాలనలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నామని హోం మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. విజయనగరం జిల్లాలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో ‘రెండేళ్ల నమ్మకం - అభివృద్ధి, సంక్షేమం’ అనే అంశంపై జిల్లా స్థాయి విజయోత్సవ సభను ‘డ్రగ్స్ రహిత రాష్ట్రం’ థీమ్‌తో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడిన అనిత, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు వెనుకబడినవి కావని, వెనక ఉండి నడిపించే జిల్లాలని వ్యాఖ్యానించారు. త్వరలోనే భోగాపురం ఎయిర్‌పోర్టును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారని, ఉత్తరాంధ్రలో గూగుల్ డేటా సెంటర్, స్టీల్ ప్లాంట్ వంటి అనేక పరిశ్రమలు వచ్చాయని తెలిపారు. నిరుద్యోగ యువతకు వేలాది ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయన్నారు. రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా ముందుకు సాగుతున్నాయని, దేశంలోనే అత్యధిక పింఛన్లు ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అన్నారు.

ఒంటరి మహిళలు, దివ్యాంగులు, వృద్ధులకు భరోసా కల్పిస్తున్నామని, రైతులకు అండగా నిలుస్తున్నామని, కుటుంబంలో ఎంత మంది పిల్లలున్నా తల్లికి వందనం ఇస్తున్నామని, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని వివరించారు.

డ్రగ్స్‌పై ఉక్కుపాదం: లోకేశ్ పాదయాత్ర సమయంలో రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ సమస్య తీవ్రంగా ఉందని గుర్తు చేసిన అనిత, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక గంజాయిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గంజాయి రవాణా, సాగు, సేవన చేసినవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటూ వారి ఆస్తులను జప్తు చేస్తున్నామని స్పష్టం చేశారు.

విద్యార్థులకు సందేశం: చదువుకునే వయసులో చిన్న తప్పిదాల వల్ల జీవితాలను నాశనం చేసుకోవద్దని విద్యార్థులను హెచ్చరించిన హోం మంత్రి, ఉజ్వలమైన భవిష్యత్తును డ్రగ్స్ వల్ల పాడు చేసుకోవద్దని సూచించారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇంటికి వస్తున్నాయని, విద్యార్థుల భవిష్యత్తు కోసం మంత్రి నారా లోకేశ్ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. తల్లిదండ్రుల త్యాగాలు వ్యర్థం కాకుండా విద్యార్థులు బాధ్యతగా ఉండాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి, ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ తదితరులు పాల్గొన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story