మే 1 నుంచి వీఐపీ బ్రేక్, ఎస్‌ఎస్‌డీ టోకెన్లు రద్దు

వైకుంఠ ఏకాదశి మోడల్‌ను అమలు చేసి భక్తుల నిరీక్షణ సమయం తగ్గించనున్న తితిదే

TTD Cancels VIP Break: వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలకు పోటెత్తే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మే 1 నుంచి వీఐపీ దర్శనాలతో పాటు స్లాటెడ్ సర్వదర్శనం (ఎస్‌ఎస్‌డీ) టోకెన్లను పూర్తిగా రద్దు చేసి, వైకుంఠ ఏకాదశి సందర్భంగా అనుసరించిన నమూనాను అమలు చేయాలని తితిదే నిర్ణయించింది.

ఈ విషయంపై తితిదే ఉన్నతాధికారులు గత మూడేళ్ల వేసవి కాల డేటాను విశ్లేషిస్తున్నారు. ఆ గణాంకాల ప్రకారం మే, జూన్, జులై నెలల్లో ప్రతి నెలా సగటున 23-24 లక్షల మంది భక్తులు శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. ప్రస్తుతం వీఐపీ దర్శనాలకు రోజుకు 2-3 గంటలు కేటాయిస్తున్నారు. ఈ సమయంలో 3,800 మంది వీఐపీలు మాత్రమే స్వామిని దర్శించుకుంటున్నారు. అయితే ఈ మూడు గంటల సమయాన్ని సామాన్య భక్తులకు కేటాయిస్తే ఒకేసారి 15 వేల మందికి దర్శన భాగ్యం కలుగుతుందని అధికారులు అంచనా వేశారు.

ప్రస్తుత ఎస్‌ఎస్‌డీ విధానంలో భక్తులు 22-23 గంటల పాటు నిరీక్షించాల్సి వస్తోంది. అన్ని దర్శనాల కేటగిరీలను పక్కనపెట్టి వైకుంఠ ఏకాదశి తరహా విధానాన్ని అమలు చేస్తే నిరీక్షణ సమయం 8-12 గంటలకు తగ్గుతుందని, రోజుకు సగటున 80 వేల మందికి స్వామివారి దర్శనభాగ్యం కల్పించవచ్చని తితిదే అంచనా వేసింది. ఈ కీలక నిర్ణయంతో వేసవి కాలంలో భక్తులకు మరింత సౌకర్యం కల్పించడమే లక్ష్యమని అధికారులు తెలిపారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story