Supreme Court: సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్.. ఏపీ స్థానిక ఎన్నికలకు మార్గం సుగమం
మార్గం సుగమం

Supreme Court: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు స్పష్టమైన గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వైఎస్సార్‌సీపీ దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోకుండా కొట్టివేసింది. దీంతో రాష్ట్రంలో స్థానిక ఎన్నికల ప్రక్రియకు అడ్డంకులు తొలగాయి.
‘సర్’ ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ వాదించింది. కానీ సుప్రీంకోర్టు ఆ వాదనలను స్వీకరించలేదు. హైకోర్టు నిర్ణయించిన ఆరు వారాల్లోపు నోటిఫికేషన్ విడుదల చేయడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది. నోటిఫికేషన్ వచ్చేలోపు ‘సర్’ పూర్తయితే కొత్త జాబితా ప్రకారం, లేకపోతే పాత జాబితా ప్రకారమే ఎన్నికలు నిర్వహించవచ్చని ధర్మాసనం పేర్కొంది.
సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఏపీ హైకోర్టు తీర్పును సమర్థించింది. ఎన్నికలకు ఆటంకం కలిగించడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు.
ఇదే సందర్భంగా స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. 34 శాతం కోటా వల్ల మొత్తం రిజర్వేషన్లు 50 శాతం పరిమితిని దాటుతున్నాయంటూ హైకోర్టు ఇటీవల రెండు జీవోలను కొట్టివేసిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. డెడికేటెడ్ కమిషన్ నివేదిక అమలు ఎక్కడ ఉందని ప్రశ్నించింది.
ఈ తీర్పులతో ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ వేగవంతం కానుంది.

