Supreme Court: ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పట్టణ స్థానిక సంస్థల (మున్సిపల్‌) ఎన్నికల్లో నామినేషన్ల దాఖలుకు అడ్డంకులు ఏర్పడ్డాయని, గడువు పొడిగించాలని వైఎస్సార్‌సీపీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు బుధవారం విచారణ జరిపి కీలక ఆదేశాలు జారీ చేసింది.19 చోట్ల తమ అభ్యర్థులను నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకున్నారని, హింస, చట్టం-శాంతి సమస్యల కారణంగా అవకాశం దక్కలేదని పార్టీ తన పిటిషన్‌లో పేర్కొంది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్‌ జయమాల్య బాగ్చి, జస్టిస్‌ వి. మోహనా లతో కూడిన బెంచ్‌.. నామినేషన్ల గడువును మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా వాయిదా వేయడానికి లేదా పొడిగించడానికి నిరాకరించింది. అయితే, నామినేషన్ల దాఖలును అడ్డుకున్నారని ఫిర్యాదు చేసిన నిర్దిష్ట చోట్లే పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ)ను ఆదేశించింది.నామినేషన్లపై ఇప్పటికే ఫిర్యాదులు, సాక్ష్యాలు (వీడియో క్లిప్స్‌ సహా) అందిన ప్రాంతాలకే ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎస్‌ఈసీ ఆ ఫిర్యాదులను పరిశీలించి, అవసరమైతే నామినేషన్ల గడువును పొడిగించాలని, అలా పొడిగిస్తే నిర్ణయం ప్రకటించిన తర్వాత కనీసం 48 గంటల సమయం అభ్యర్థులకు ఇవ్వాలని ఆదేశించింది. ఈ నిర్ణయం గురువారం (అక్టోబర్‌ 22) లోపు తీసుకోవాలని స్పష్టం చేసింది. నామినేషన్లకు అవకాశం కల్పిస్తే జిల్లా కలెక్టర్‌ వద్ద కూడా దాఖలు చేసుకునే అవకాశం ఇవ్వాలని సూచించింది.మరోవైపు, అభ్యర్థుల తుది జాబితా ప్రకటన గడువును ఈ నెల 25 వరకు సుప్రీంకోర్టు పొడిగించింది (అసలు గడువు అక్టోబర్‌ 21). కోర్టుల్లో కేసులు వేయడం తప్ప ఎక్కడా ఫిర్యాదులు చేయలేదని ఎస్‌ఈసీ తెలిపింది. తమ ఆదేశాలపై తీసుకున్న చర్యలపై అక్టోబర్‌ 27న నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలు రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణంలో భాగమని, నామినేషన్లు దాఖలు చేసుకునే హక్కు ఆ ప్రక్రియలో కీలకమని కోర్టు పేర్కొంది. అభ్యర్థులకు రక్షణ కల్పించాలని, నామినేషన్‌ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు, సీసీటీవీ కవరేజీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించింది. ఎస్‌ఈసీ అవసరమైన చర్యలు తీసుకుని అభ్యర్థుల్లోని భయాందోళనలను తొలగించాలని కూడా సూచించింది.

Next Story