Viveka Murder Case: సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు: వివేకా హత్య కేసులో తదుపరి దర్యాప్తుకు సీబీఐకి స్వేచ్ఛ
వివేకా హత్య కేసులో తదుపరి దర్యాప్తుకు సీబీఐకి స్వేచ్ఛ

Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తు విషయంలో ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీం కోర్టు సమర్థించింది. కిరణ్ యాదవ్, అర్జున్ రెడ్డిల మధ్య హత్య జరిగిన రోజు జరిగిన సమాచార మార్పిడిపై విచారణలో కొత్త అంశాలు వెలుగులోకి వస్తే వాటిపైనా దర్యాప్తు చేసే స్వేచ్ఛ సీబీఐకి ఉంటుందని స్పష్టం చేసింది. అదనపు సాక్ష్యాలు లేదా సమాచారం ఉంటే వివేకా కుమార్తె సునీత నర్రెడ్డి సీబీఐకు సమర్పించవచ్చని అవకాశం కల్పించింది.
గత ఏడాది డిసెంబర్ 10న సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు కిరణ్ యాదవ్ (నిందితుడు సునీల్ యాదవ్ సోదరుడు), అర్జున్ రెడ్డి (నిందితుడు వైఎస్ భాస్కరరెడ్డి సోదరుడి కుమారుడు) మధ్య హత్య రోజు జరిగిన కాల్ లేదా సమాచార మార్పిడిపై నెల రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశించింది. అయితే ఈ దర్యాప్తును ఆ ఒక్క అంశానికే పరిమితం చేయకుండా, కొత్త విషయాలు బయటపడితే వాటిపైనా విచారణ కొనసాగించేలా ఆదేశాలు జారీ చేయాలని, గడువు సవరణ చేయాలని సునీత సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
జస్టిస్ ఎం.ఎం. సుందరేష్, జస్టిస్ ఎన్.కే. సింగ్ ధర్మాసనం గురువారం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. సునీత వాదనలను పరిగణనలోకి తీసుకుని ట్రయల్ కోర్టు ఉత్తర్వులను యథాతథంగా కొనసాగించాలని సీబీఐకు స్పష్టం చేసింది. దర్యాప్తులో కొత్త అంశాలు వెలుగులోకి వస్తే వాటిపై దర్యాప్తు చేసే స్వేచ్ఛ ఉందని, ఎవరినైనా విచారించాలంటే చెప్పండని సీబీఐ తరఫున హాజరైన అడిషనల్ సాలిసిటర్ జనరల్‌కు ధర్మాసనం సూచించింది.
సునీత తరఫు న్యాయవాది జస్టిస్ లూథ్రా వాదనలు వినిపిస్తూ ట్రయల్ కోర్టు ఆదేశాలు ఒకే కోణంలో ఉన్నాయని, దర్యాప్తు గడువు నెల రోజులుగా ఉండటం సీబీఐపై ఒత్తిడి తెస్తుందని తెలిపారు. అయితే జస్టిస్ సుందరేష్ మాట్లాడుతూ "కొంత సమయం ఇద్దాం. సీబీఐ ఏం చేస్తుందో చూడండి. 2025 డిసెంబర్ 10 ఉత్తర్వుల ప్రకారం సాధ్యమైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేయాలి. కొత్త విషయాలు ఉంటే పిటిషనర్ సీబీఐకు అప్పగించవచ్చు" అని పేర్కొన్నారు.
ఈ కేసులో మళ్లీ మినీ ట్రయల్ నిర్వహించలేమని, హైకోర్టుకు వెళితే మరో మూడేళ్లు పడుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
ఈ తీర్పుతో వివేకా హత్య కేసు దర్యాప్తు మరింత లోతుగా కొనసాగే అవకాశం ఏర్పడింది. సునీత రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు సానుకూలంగా స్పందించడం గమనార్హం.

