Minister Nara Lokesh: తెలుగుదేశం పార్టీ నేతలు సోషల్ మీడియాను సమర్థంగా వినియోగించి ప్రభుత్వ అభివృద్ధి పనులను ప్రజలకు తెలియజేయాలని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి, టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ దిశానిర్దేశం చేశారు.

మంగళవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో రెండో రోజు ‘పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్’ అంశంపై మాట్లాడుతూ ఆయన ఈ విషయం సూచించారు. సోషల్ మీడియాను తేలికగా తీసుకోకుండా సీరియస్‌గా వినియోగించాలని నేతలను ఆదేశించారు. ఎంతమంది నాయకులు సోషల్ మీడియాను యాక్టివ్‌గా వాడుతున్నారని ప్రశ్నించారు.

ఏఎంసీ, కార్పొరేషన్ చైర్మన్లు తమ పనులను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ఓపెన్‌గా ప్రజలకు చేరవేయాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం సెల్ఫీ వీడియోల ద్వారా తమ సందేశాలను చేరవేస్తున్నారని ఉదాహరణ చూపారు. తాను స్వయంగా సుజ్లాన్ విండ్ ప్రాజెక్ట్ శంకుస్థాపన సందర్భంగా, అలాగే డీఎస్సీపై జరుగుతున్న దుష్ప్రచారం విషయంలో సెల్ఫీ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశానని తెలిపారు.

ఏదైనా విషయం చిన్నదైనా, పెద్దదైనా ప్రజలకు వాస్తవాలు చేరవేయాలని లోకేశ్ సూచించారు. వైసీపీ నిరంతరం తమ ప్రభుత్వంపై బురద జల్లుతోందని విమర్శించారు. జగన్ అండ్ కో దుష్ప్రచారాన్ని సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని ఆదేశించారు. పార్టీ ఆదేశాలు, కార్యక్రమాలపై సోషల్ మీడియా టీమ్‌లు వెంటనే స్పందించాలని మార్గనిర్దేశం చేశారు. జగన్ మాట్లాడితే వైసీపీ నేతలు, కార్యకర్తలు గుడ్డిగా సమర్థిస్తున్నారని ఎద్దేవా చేశారు. అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని, ఈ విషయాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు.

Next Story