Tammeneni Seetharam: భూకబ్జా కేసులో పోలీసు విచారణకు హాజరైన తమ్మినేని సీతారాం
తమ్మినేని సీతారాం

Tammeneni Seetharam: మాజీ స్పీకర్, వైఎస్సార్‌సీపీ నేత తమ్మినేని సీతారాం శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్‌లో భూ వివాదాల కేసులో విచారణకు హాజరయ్యారు. రూ.4 కోట్ల విలువైన భూకబ్జా కుట్ర కేసులో తమ్మినేని, ఆయన భార్య వాణి, కుమారుడు వెంకట శ్రీరామ చిరంజీవి నాగ్ నిందితులుగా ఉన్నారు.
బతికున్న భూ యజమానిని చనిపోయినట్లు నకిలీ పత్రాలు సృష్టించి, ఏకైక వారసురాలంటూ ఒడిశాకు చెందిన ఓ మహిళను తెరపైకి తెచ్చి చేసిన భూకబ్జా కుట్రలో తమ్మినేని కుటుంబం పాత్రను పోలీసులు బట్టబయలు చేశారు. ఇంతకుముందు ఆమదాలవలసలోని అద్దె ఇంట్లో ఉన్న తమ్మినేని కుటుంబం ప్రైవేటు ఇన్నోవా కారులో పరారయ్యారు. పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టిన నేపథ్యంలో తమ్మినేని బుధవారం ఉదయం విచారణకు హాజరయ్యారు.
ఇదే కేసులో తమ్మినేని కుమారుడు వెంకట శ్రీరామ్ చిరంజీవి నాగ్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అరెస్ట్ నుంచి రక్షణ, మధ్యంతర ముందస్తు బెయిల్ కోరిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణిశ్రీకి తాత్కాలిక మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణ వరకు వీరిద్దరిని అరెస్ట్ చేయొద్దని, ఐవో ముందు హాజరుకావాలని, దర్యాప్తుకు సహకరించాలని ఆదేశించింది. ప్రధాన బెయిల్ పిటిషన్‌పై విచారణను ఆగస్టు 17కు వాయిదా వేసింది. ప్రస్తుతం తమ్మినేని కుమారుడు నాగ్ పరారీలోనే ఉన్నారు.

