కుటుంబం!

భార్య, కుమారుడితో కలిసి తప్పించుకున్న వైకాపా నేత - భూకబ్జా కుట్రలో నిందితులు
Tammineni Seetharam: వైకాపా నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబం సహా పరారీలో ఉన్నట్లు సమాచారం. శ్రీకాకుళంలో సంచలనం సృష్టించిన రూ.4 కోట్ల విలువైన భూకబ్జా కుట్ర కేసులో తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణి, కుమారుడు వెంకట శ్రీరామ చిరంజీవి నాగ్‌లు నిందితులుగా ఉన్నారు.
బతికున్న భూ యజమానిని చనిపోయినట్లు నకిలీ పత్రాలు సృష్టించి, ఏకైక వారసురాలంటూ ఒడిశాకు చెందిన ఓ మహిళను తెరపైకి తెచ్చి భూములను కబ్జా చేసిన కుట్రలో తమ్మినేని కుటుంబం పాత్రను పోలీసులు ఆదివారం బట్టబయలు చేశారు. అప్పటి వరకు ఆమదాలవలసలో అద్దె ఇంట్లో ఉన్న తమ్మినేని కుటుంబం సోమవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో తప్పించుకుని వెళ్లిపోయింది. ఇంట్లో రెండు సొంత కార్లు ఉన్నప్పటికీ ప్రైవేటు ఇన్నోవా కారును ఏర్పాటు చేసుకుని అందులో పరారయ్యారు. ఫోన్లు కూడా ఇంట్లోనే వదిలేసి వెళ్లినట్లు తెలుస్తోంది.
పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. అరెస్టు తప్పదని భావించిన తమ్మినేని పోలీసుల కళ్లుగప్పి తప్పించుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
అరెస్టుకు జాప్యం ఎందుకు?
చాపురం పంచాయతీ బలగ పరిధిలోని స్థలం నకిలీ పత్రాలతో కొట్టేయడంలో కీలక పాత్ర పోషించిన 13 మందిలో 8 మందిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. తమ్మినేని కుటుంబంలో ముగ్గురు నిందితులుండగా, మిగిలిన ఇద్దరిలో ఒకరు మాజీ హోంగార్డు త్రినాథ్, మరొకరు హిరమండలం సబ్‌రిజిస్ట్రార్. కొన్ని రోజులుగా త్రినాథ్ కోసం గాలిస్తున్నా ఆచూకీ దొరకలేదు. కళ్లెదుట ఉన్న తమ్మినేని కుటుంబాన్ని అరెస్టు చేయకపోవడం, న్యాయసలహా తీసుకుంటున్న సమయంలో నిందితులు తప్పించుకోవడం విమర్శలకు దారితీసింది.
ఇంకా దొంగ రిజిస్ట్రేషన్లు ఉన్నాయా?
మాజీ హోంగార్డు త్రినాథ్, తెలుగు సతీష్ కుమార్, సాలిపల్లి లక్ష్మణరావు, రజని, డాక్యుమెంట్ రైటర్ కూన పెద్దిరాజులు ఒక ముఠాగా ఏర్పడి నకిలీ పత్రాలతో పదుల సంఖ్యలో డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసినట్లు గుర్తించారు. వైకాపా హయాంలో తమ్మినేని సీతారాం కొనుగోలు చేసిన భూముల్లో ఇలాంటి దొంగ రిజిస్ట్రేషన్లు ఉన్నాయా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. తమ్మినేని దంపతుల ఆదేశాల మేరకు వారి కళాశాలలో పని చేసే ఉపేంద్ర కుమార్, ఉపేంద్రరావు, సాంబశివరావు, గోపాలకృష్ణలు నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్‌కు సాక్షి సంతకాలు చేసినట్లు సమాచారం.
తమ్మినేనిపై ఇతర కబ్జా ఆరోపణలు:
ఆమదాలవలస టీఎస్‌ఆర్ కళాశాలకు ఆనుకుని ఉన్న 8 సెంట్ల స్థలాన్ని ఆక్రమించినట్లు గత నెలలో వృద్ధ దంపతులు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు స్థలం బాధితులకు అప్పగించారు.
స్పీకర్‌గా ఉన్నప్పుడు టెక్కలి మండలం చింతామణి గ్రామంలో 23 ఎకరాల భూమిని బలవంతంగా రాయించుకున్నారని ఆరోపణలు.
సన్నిహితుల ఇండ్లు, పోలీసు కానిస్టేబుల్ ఇల్లు వంటి ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు మరిన్ని ఆరోపణలు ఉన్నాయి.
పోలీసులు తమ్మినేని కుటుంబ సభ్యులను త్వరలో అరెస్టు చేసి విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఈ కేసు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది.

