కొరివితో తలగోక్కున్న టీడీపీ ఎమ్మెల్యే
తారక్ సినిమా అడ్డుకుంటానని ప్రగల్బాలు… ఆడియో లీక్ అవ్వడంతో నేను కాందటూనే క్షమాపణలు

తెలుగుదేశం పార్టీకి చెందిన అనంతపురం అర్బన్ శాసనసభ్యుడు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కొరివితో తలగోక్కున్నారు. తన నోటి దూలతో జూనియర్ ఎన్టీఆర్‌పైన పరుష పదజాలంతో దూషిస్తూ ఇటీవల విడుదలైన ఆయన నటించిన వార్-2 సినిమాను అనంతపురంలో ఆడనివ్వనని ప్రగల్బాలు పలికారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకుడు ధనుంజయ్‌తో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చేసిన ఫోన్ సంభాషణ రికార్డింగ్ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వినలేని విధంగా బూతులు తిడుతూ ఎన్టీఆర్ సినిమా అనంతపురంలో ఆడదు అంటూ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పదే పదే శపథాలు చేసినట్లు ఆ వాయిస్ రికార్డింగ్‌లో స్పష్టంగా ఉంది. ఇది కాస్తా వైరల్ అవ్వడంతో తారక్ అభిమానులు పెద్దయెత్తున ఆందోళనలకు పూనుకున్నారు. వందలాది మంది అభిమానులు అనంతపురంలో దగ్గుపాటి ప్రసాద్ కార్యాలయం ముందు కూడా ధర్నా చేసి ఆయన క్షమాపణలు చెప్పేంత వరకూ విరమించేది లేదని భైటాయించారు.
తారక్ అభిమానుల నిరసనలు చూసి ఖంగుతిన్న ఎమ్మెల్యే దగ్గుపటి ప్రసాద్ వెంటనే ప్లేటు ఫిరాయించారు. ఆ రికార్డింగులో ఉన్న వాయిస్ నాది కాదని నమ్మబలకాలని చూశారు. దీనికి తారక్ అభిమానులు కన్విన్స్ కాకపోవడంతో ఆ వాయిస్ నాది కాకపోయినా తారక్ అభిమానులు బాధపడ్డారు కాబట్టి క్షమాపణలు చెపుతున్నానంటూ ఒక వీడియోను విడుదల చేశారు. అయితే తారక్ అభిమానులు ఈ వీడియోకి కూడా సంతృప్తి చెందలేదు. ఎట్టి పరిస్ధితుల్లో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అనంతపురంలో ఎక్కడ ఎమ్మెల్యే ఫ్లెక్సీలు కనిపించిన తారక్ అభిమానులు వాటిని చింపివేసి నిరసనలు తెలుపుతున్నారు. ఇది అనంతపురంతోనే ఆగిపోకుండా జిల్లాలకు వ్యాపిస్తోంది. సోమవారం దాదాపు ఏపీలోని అన్ని జిల్లాల్లో తారక్ అభిమానులు నిరసనలు తెలియజేశారు.
ఇదిలా ఉండగా ఈ వ్యవహారం తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా మారింది. ఇప్పటికే తారక్ అభిమానులకు టీడీపీ కార్యకర్తలకు మధ్య ఉప్పూ నిప్పుగా ఉంది వ్యవహారం. తెలుగుదేశం పార్టీ కార్యాలయాల నుంచే తారక్ సినిమాలపై బ్యాడ్ ప్రోపగండా చేసి సినిమా ఫ్లాప్ అయ్యిందని మౌత్ పబ్లిసిటీ చేస్తున్నరని ఎప్పటి నుంచో తారక్ అభిమానులు టీడీపీపై మండిపడుతున్నారు. పైగా ఎమ్మెల్యే దగ్గపాటి ప్రసాద్‌పై నిసరనలు చేస్తున్న క్రమంలో తామంతా తారక్ మొహం చూసే గత ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేశామని, మేము వేసిన ఓట్లతో గెలిచి తమ అభిమాన కథానాయకుడ్నే తిడతారా అంటూ మీడియా ముందు తారక్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం ఎటు నుంచి ఎటు వెళుతుందో అన్న ఆందోళనలో టీడీపీ అధిష్టానం ఎమ్మెల్యే దగ్గుపాటిని తీవ్ర స్ధాయిలో మందలించినట్లు సమాచారం. చంద్రబాబు సైతం దగ్గుపాటి ప్రసాద్ నోటి దూల వ్యవహారంపై అసహనం వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు చెపుతున్నాయి. అయితే తారక్ అభిమానులు మాత్రం తమ హీరో గురించి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చేసిన నేలబారు వ్యాఖ్యలను జీర్ణించుకోలేపోతున్నాయి. అటు చిత్తూరు జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకూ ఆయన అభిమానులు రోడ్లపైకి వచ్చి తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. దగ్గుపాటి ప్రసాద్ బహిరంగ క్షమాపణలు చెప్పినా ఆయన్ను క్షమించే పరిస్ధితుల్లో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కనిపించడం లేదు.
