CM Chandrababu: మన పురాణాలు, సంస్కృతిని పిల్లలకు నేర్పండి: సీఎం చంద్రబాబు
పిల్లలకు నేర్పండి: సీఎం చంద్రబాబు

CM Chandrababu: పిల్లలకు స్పైడర్‌మ్యాన్, సూపర్‌మ్యాన్ వంటి పాశ్చాత్య సూపర్‌హీరోల కథల కంటే మన రామాయణం, మహాభారతం, పురాణాల్లోని గొప్ప పాత్రల గురించి చెప్పాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. హనుమంతుడు సూపర్‌మ్యాన్‌కంటే గొప్పవాడని, అర్జునుడు బ్యాట్‌మ్యాన్, ఐరన్‌మ్యాన్ కంటే శ్రేష్ఠమైన యోధుడని, రాముడు ప్రపంచంలోనే అత్యంత ఉత్తమ పురుషుడని వివరించాలన్నారు. రామరాజ్యం ఆదర్శాన్ని పిల్లలకు తెలియజేయాలని సూచించారు. తిరుపతిలో జరిగిన భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో సీఎం చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.
అవతార్ సినిమా కంటే మన రామాయణం, మహాభారతం ఎంతో గొప్పవని, మంచి-చెడుల మధ్య తేడాను పిల్లలకు బోధించే బాధ్యత తల్లిదండ్రులపై ఉందని చంద్రబాబు అన్నారు. పురాణాలు మరచిపోతున్న సమయంలో ఎన్టీఆర్ పురాణ చిత్రాల ద్వారా సాంస్కృతిక చైతన్యాన్ని తెచ్చిన గొప్ప నాయకుడని కొనియాడారు. రాజకీయాల్లోనూ ఆదర్శాలు పాటించిన వ్యక్తిగా ఆయన్ను పేర్కొన్నారు.
దేశాభివృద్ధికి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ పునాదులు వేశారని, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో అద్భుత ప్రగతి సాధిస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. వినూత్న ఆలోచనలు, ఆవిష్కరణలతో ముందుకు సాగాలని, భవిష్యత్తులో భారత్ సూపర్ పవర్‌గా అవతరించనుందని ధీమా వ్యక్తం చేశారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ దేశాభివృద్ధికి ఆర్‌ఎస్‌ఎస్ సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భాగవత్ కృషి చేస్తున్నారని ప్రశంసించారు.
2047 నాటికి భారత్ ప్రపంచ శక్తిగా మారనుంది
మన దేశంలో జ్ఞానానికి కొదవ లేదని, 1991 ఆర్థిక సంస్కరణల తర్వాత వేగవంతమైన మార్పులు చోటుచేసుకున్నాయని చంద్రబాబు తెలిపారు. మోదీ నాయకత్వంలో స్థిరమైన ప్రభుత్వం ఉండటంతో 2038 నాటికి భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి ప్రపంచ శక్తిగా అవతరించనుందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ఉన్నారని, జనాభా పెరుగుదలలో భారత్ ముందుంజలో ఉందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో తిరుపతిలో స్పేస్ సిటీ, కర్నూలులో డ్రోన్ సిటీ, అనంతపురంలో ఏరోస్పేస్ సిటీ, విశాఖపట్నంలో మెడ్‌టెక్ పార్కు ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. గతంలో హైదరాబాద్‌లో ఐటీని ప్రోత్సహించిన ఫలితంగా తెలుగువారు అత్యధిక వేతనాలు పొందుతున్నారని, ఇప్పుడు అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్, విశాఖలో గూగుల్ పెట్టుబడులు ఆకర్షిస్తున్నామని చెప్పారు.
బ్రహ్మోస్ క్షిపణులకు ప్రపంచవ్యాప్త డిమాండ్: కేంద్రమంత్రి జితేంద్ర సింగ్
స్టార్టప్‌లు, స్పేస్ ఎకానమీలో భారత్ దూసుకెళ్తోందని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో 81 నుంచి 38వ ర్యాంక్‌కు చేరుకున్నామని, చంద్రయాన్ విజయాలు సాధించామని పేర్కొన్నారు. రక్షణ ఎగుమతులు పెరిగాయని, బ్రహ్మోస్ క్షిపణులకు డిమాండ్ ఉందని, కోవిడ్ వ్యాక్సిన్లు ఎగుమతి చేశామని తెలిపారు.
క్షమాగుణమే మనిషిని ఉన్నతస్థాయికి చేరుస్తుంది: మోహన్ భాగవత్
ప్రతి వ్యక్తీ స్వయంగా కర్తవ్యాన్ని నిర్దేశించుకోవాలని, విజ్ఞానం-ధర్మం మధ్య వైరుధ్యం లేదని ఆర్‌ఎస్‌ఎస్ అధ్యక్షుడు మోహన్ భాగవత్ అన్నారు. స్వామి వివేకానంద బోధలను గుర్తుచేశారు.

