CM Chandrababu: రెవెన్యూశాఖలో సాంకేతికతను సమగ్రంగా అమలు చేయాలి: సీఎం చంద్రబాబు
సాంకేతికతను సమగ్రంగా అమలు చేయాలి: సీఎం చంద్రబాబు

CM Chandrababu: రెవెన్యూ శాఖలో టెక్నాలజీని త్వరితగతిన సమగ్రంగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశించారు. మంగళవారం ఏపీ సచివాలయంలో రెవెన్యూ, భూములు, ఆదాయార్జన శాఖలపై జరిగిన కలెక్టర్ల సదస్సులో సీఎం పలు కీలక సూచనలు చేశారు. సింహాచల భూముల పంచ గ్రామాల సమస్యను తక్షణం పరిష్కరించాలని, పీజీఆర్ఎస్‌లో వచ్చిన ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. రెవెన్యూ, పోలీసు విభాగాలకు వచ్చిన ఫిర్యాదుల్లో 70 శాతం ఆర్ఓఆర్‌కు సంబంధించినవేనని, గత పాలకుల తప్పిదాల వల్ల భూ వివాదాలు పెరిగాయని సీఎం పేర్కొన్నారు.
జీఎస్టీ 2.0 సంస్కరణలతో ప్రతి ఏడాది రూ.8 వేల కోట్ల ప్రయోజనం ప్రజలకు కలుగుతుందని తెలిపారు. ఈ నెల 19న పన్నుల తగ్గింపుపై నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు, గ్రామస్థాయిలో పన్ను తగ్గింపు వివరాలను ప్రజలకు తెలియజేసేలా ప్రకటన జారీ చేస్తామని వివరించారు. జీవిత భీమా, ఆరోగ్య భీమాపై జీఎస్టీ రద్దు చేసినట్లు స్పష్టం చేశారు. యూనివర్సల్ హెల్త్ కార్డు ప్రయోజనాలను అంచనా వేయాలని సూచించారు.
జీఎస్టీ తగ్గింపుపై అవగాహన కార్యక్రమాలు
సెప్టెంబరు 22 నుంచి అక్టోబరు 22 వరకు జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సీఎం తెలిపారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు, కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. జిల్లాల వారీగా జీఎస్టీ, పన్ను ఆదాయాలను పర్యవేక్షించాలని, మైనింగ్ ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉచిత ఇసుక విధానంతో రూ.1000 కోట్ల రెవెన్యూ నష్టం ఉన్నప్పటికీ, ప్రజల సంతృప్తి కోసం అధికారులు కృషి చేయాలని ఆదేశించారు.
ఆర్టీజీ కేంద్రాలు నవంబర్ నుంచి
ప్రభుత్వ సేవలకు రేటింగ్ ఇవ్వనున్నట్లు సీఎం తెలిపారు. క్షేత్రస్థాయి సమాచారం ఆర్టీజీఎస్ ద్వారా సేకరించాలని, రిపోర్టుల కోసం కలెక్టర్లను ఆదేశించవద్దని సూచించారు. యువ ఐఏఎస్ అధికారుల సేవలను వినియోగించుకోవాలని, టెక్నాలజీ వినియోగంపై శిక్షణ ఇవ్వాలని తెలిపారు. నవంబర్ నుంచి ఆర్టీజీ జిల్లా కేంద్రాలు అందుబాటులోకి వస్తాయని, క్వాంటం భవనాల డిజైన్‌పై కలెక్టర్ల అభిప్రాయం కోరారు.
ఎర్రచందనంపై కీలక సూచనలు
ఎర్రచందనం విలువ లక్షల కోట్లని, శేషాచలం కొండల్లో మాత్రమే లభ్యమయ్యే ఈ వనరిని సద్వినియోగం చేసుకోవాలని సీఎం ఆదేశించారు. ఎర్రచందనం అమ్మకాల ద్వారా ఆదాయం పెంచేందుకు కచ్చితమైన ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. దీనిపై అధిక డిమాండ్ ఉన్నందున, ఆదాయ వనరుగా దీన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు.
