Minister Nara Lokesh: నేపాల్‌లో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా తీసుకొస్తాం: మంత్రి నారా లోకేశ్ హామీ
తెలుగువారిని సురక్షితంగా తీసుకొస్తాం: మంత్రి నారా లోకేశ్ హామీ

Minister Nara Lokesh: నేపాల్‌లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ (ఏపీ) వాసులను సురక్షితంగా స్వరాష్ట్రానికి తీసుకొచ్చేందుకు మంత్రి నారా లోకేశ్ కసరత్తు చేస్తున్నారు. సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. నేపాల్‌లో ఉన్న తెలుగు వారి గురించి అధికారులు మంత్రికి వివరించారు. బాధితులతో వీడియో కాల్ ద్వారా మాట్లాడిన లోకేశ్, అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
కాఠ్‌మాండూ నుంచి విశాఖకు ప్రత్యేక విమానం ఏర్పాటు
మంత్రి లోకేశ్ ఏపీ భవన్ అధికారి అర్జా శ్రీకాంత్, సీనియర్ అధికారులు కార్తికేయ మిశ్రా, ముకేశ్‌కుమార్ మీనా, కోన శశిధర్, అజయ్ జైన్, హిమాన్షు శుక్లా, జయలక్ష్మితో సమీక్ష నిర్వహించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, నేపాల్‌లో సుమారు 240 మంది తెలుగు వారు చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో గౌశాలలో 90 మంది, పశుపతి నగరంలో 55 మంది, బఫాల్‌లో 27 మంది, సిమిల్‌కోట్‌లో 12 మంది, ఇతర ప్రాంతాల్లో మరికొంతమంది ఉన్నట్లు సమాచారం. వీరిని కాఠ్‌మాండూ నుంచి విశాఖపట్నానికి ప్రత్యేక విమానం ద్వారా తీసుకొచ్చేందుకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. బాధితులకు వెంటనే సహాయం అందించి, వారిని తరలించే బాధ్యతను అధికారులకు అప్పగించారు. ప్రతి రెండు గంటలకు బాధితుల క్షేమ సమాచారం తెలుసుకోవాలని, వీలైనంత త్వరగా వారిని రాష్ట్రానికి చేర్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విదేశాంగ శాఖ అధికారులతో నిరంతర సంప్రదింపులు జరుపుతున్నట్లు రాష్ట్ర అధికారులు మంత్రికి తెలిపారు.
బాధితులతో వీడియో కాల్‌లో సంభాషణ
నేపాల్‌లో చిక్కుకున్న కొందరు తెలుగు వారితో మంత్రి లోకేశ్ వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. మహిళలు సూర్యప్రభ, రోజారాణి అక్కడి పరిస్థితులను వివరించారు. ముక్తినాథ్ దర్శనం కోసం వెళ్లి చిక్కుకున్నట్లు సూర్యప్రభ తెలిపారు. హోటల్ నుంచి బయటకు రావొద్దని, ప్రతి రెండు గంటలకు అధికారులు సంప్రదిస్తారని లోకేశ్ సూచించారు. మంగళగిరికి చెందిన మాచర్ల హేమసుందర్‌రావు, దామర్ల నాగలక్ష్మితో కూడా మంత్రి మాట్లాడారు. మంగళవారం తాము ప్రయాణిస్తున్న బస్సుపై ఆందోళనకారులు దాడి చేసినట్లు వారు తెలిపారు. పశుపతి ఫ్రంట్ హోటల్‌లో తమతో పాటు 40 మంది తెలుగు వారు ఉన్నట్లు, కాఠ్‌మాండూ విమానాశ్రయానికి కిలోమీటరు దూరంలో తమ హోటల్ ఉన్నట్లు వివరించారు. ఆందోళన చెందవద్దని, సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మంగళగిరి వాసులతో రాష్ట్ర వైద్య, మౌలిక సదుపాయాల సంస్థ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు సంప్రదింపుల్లో ఉంటారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో బాధితులను సురక్షితంగా తీసుకొస్తామని లోకేశ్ భరోసా ఇచ్చారు.
ఏపీ భవన్‌లో హెల్ప్‌లైన్ ఏర్పాటు
నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ వాసుల కోసం దిల్లీలోని ఏపీ భవన్‌లో రాష్ట్ర ప్రభుత్వం హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది. అత్యవసర సహాయం కోసం +91 9818395787, APNRTS 24/7 హెల్ప్‌లైన్ నంబర్లు 0863 2340678, వాట్సప్: +91 8500027678, ఈ-మెయిల్: helpline@apnrts.com, info@apnrts.com ద్వారా సంప్రదించవచ్చు. అలాగే, కాఠ్‌మాండూలోని భారత రాయబార కార్యాలయంలో +977-980 860 2881, +977-981 032 6134 నంబర్ల ద్వారా సాధారణ కాల్స్ లేదా వాట్సప్‌లో సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.
