SAAP Office: నగరంలోని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (శాప్‌) కార్యాలయం వద్ద సోమవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. మెగా డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా టీచర్లు, వైకాపా నేతలు పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు.

డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా నియామకాల్లో అక్రమాలు జరిగాయని వైకాపా నేతలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో, వాటిని ఖండిస్తూ స్పోర్ట్స్‌ కోటా టీచర్లు శాప్‌ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. క్రీడల మంత్రి రాంప్రసాద్‌రెడ్డి, శాప్‌ ఛైర్మన్‌, ఎండీకి వినతిపత్రాలు అందజేసేందుకు వచ్చిన టీచర్లు తమ సర్టిఫికెట్లు, మెడళ్లు నిజమైనవని, ఆరోపణలు చేసేవారికి ఆధారాలు చూపిస్తామని నినాదాలు చేశారు.

అదే సమయంలో వైకాపా నేతలు కార్యాలయం బయట బైఠాయించారు. డీఎస్సీలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. దీంతో ఇరుపక్షాల మధ్య నినాదాలు వినిపించాయి. వైకాపా నేతల ఆరోపణలను టీచర్లు తీవ్రంగా ఖండించారు.

పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో పోలీసులు, వైకాపా నేతల మధ్య తోపులాట జరిగింది. పలువురు వైకాపా నేతలు పోలీసులను నెట్టివేశారు. టీచర్లపై వాటర్‌ బాటిళ్లు విసిరి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అనంతరం పోలీసులు వైకాపా నేతలను చెదరగొట్టారు. నిరసన తెలుపుతున్న టీచర్ల వద్దకు శాప్‌ ఎండీ భరణి చేరుకుని వారితో మాట్లాడారు.

Next Story