Pulivendula: పులివెందులలో నామినేషన్ల వేళ తీవ్ర ఉద్రిక్తత.. వైసీపీ శ్రేణుల రాళ్లదాడి, ఎస్పీపై దాడి
ఎస్పీపై దాడి

Pulivendula: కడప జిల్లా పులివెందులలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల దాఖలు సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎంపీ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు నామినేషన్ కేంద్రం వద్దకు భారీ సంఖ్యలో మోహరించారు. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం ఘర్షణగా మారింది. పోలీసులు టీడీపీ శ్రేణులను ముందుగా అనుమతిస్తామని చెప్పడంతో వైసీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరువర్గాలు పరస్పరం రాళ్లతో దాడులు చేసుకున్నాయి.
పరిస్థితి చేయిదాటిపోతుండటంతో కడప ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ హుటాహుటిన పులివెందులకు చేరుకున్నారు. ఆయన రాకను గమనించిన వైసీపీ కార్యకర్తలు ఎస్పీపైనే రాళ్ల దాడి చేశారు. పోలీసులు ఆయనకు రక్షణగా నిలిచారు. ముందుగా డీఎస్పీ మురళీనాయక్ ఆరు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ఎస్పీ మరో పది రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి, టియర్ గ్యాస్, బాష్పవాయు గోళాలను కూడా ప్రయోగించారు. పోలీసులు లాఠీఛార్జ్ కూడా చేశారు.
నామినేషన్ల దాఖలు సమయం ముగిసిన తర్వాత ఎస్పీ విశ్వనాథ్ ఎంపీ అవినాష్ రెడ్డిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. వెళ్లకపోతే అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. ఎస్పీ హెచ్చరికల నేపథ్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి తన అనుచరులను వెళ్లిపోవాలని చెప్పి, తానూ వెళ్లిపోయారు. ఈ ఘటనలో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఇదే సమయంలో అన్నమయ్య జిల్లా పుంగనూరు పోలీసు స్టేషన్లో వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. ఎంపీ మిథున్ రెడ్డి సహా 70 మందిపై కేసులు నమోదు చేశారు. వైసీపీ నేతలు విధి నిర్వహణకు ఆటంకం కలిగించారని డీఎస్పీ ప్రసాద్తో పాటు ఇద్దరు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు.

