Thalliki vandanam to all the students in AP - Minister Lokesh

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పాటయి యేడాది గడిచిన సందర్భంగా సూపర్‌ సిక్స్‌లో మరో హామీని అమలు చేయబోతున్నట్లు రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ తెలిపారు. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం అవుతున్న వేళ.. తల్లికి వందనం పథకానికి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారన్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని అర్హులైన ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో ఆర్థిక సహాయం జమ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో మొత్తం 67 లక్షల 27 వేల 164 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుందని లోకేష్‌ వెల్లడించారు. విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం మొత్తం రూ.8745 కోట్లు జమ చేయనుందన్నారు. ఒకటో తరగతిలో కొత్తగా అడ్మిషన్ తీసుకునే విద్యార్థులతో పాటు.. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరుతున్న విద్యార్థులకు కూడా తల్లికి వందనం పథకం వర్తిస్తుందని లోకేష్‌ స్పష్టం చేశారు. ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికీ ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని మంత్రి నారా లోకేష్‌ వివరించారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తోందని లోకేష్‌ గుర్తు చేశారు. ఇప్పటికే పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, మెగా డీఎస్సీ ప్రకటన, దీపం-2 పథకాల అమలు దిశగా చర్యలు తీసుకున్నామని, తాజాగా 'తల్లికి వందనం' పథకం అమలుతో మరో ముఖ్యమైన హామీని నిలబెట్టుకున్నామని లోకేష్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఈ పథకానికి పచ్చజెండా ఊపడం సంతోషకరమని ఆయన అన్నారు.



Politent News Web4

Politent News Web4

Next Story