జడ్జిమెంట్‌ ఇవ్వడం కోసం పిలవలేదు – కిషన్‌ రెడ్డి

ఆంద్రప్రదేశ్‌ తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలసి చర్చించుకునేలా కేంద్ర చర్యలు తీసుకుంది తప్ప తీర్పు ఇవ్వడం కోసం పిలవలేదని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు. బనకచర్ల ప్రాజెక్టుపై ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి స్పందించారు. బీఆర్‌ఎస్‌ నేతలది అధికారంలో ఉన్నప్పుడు ఒక పాలసీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో పాలసీ అని కిషన్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ అపరిచితుడిలా మాట్లాడతారని అన్నారు. బేసిన్లు లేవు భేషజాలు లేవు అని అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్‌ చెప్పిన విషయాన్ని కిషన్‌ రెడ్డి గుర్తు చేశారు. బనకచర్ల విషయంలో ప్రధానమంత్రిని, జలశక్తి మంత్రిని మూడు సార్లు కలిశానని తెలంగాణ వాదన వినాలని కోరానని కిషన్ రెడ్డి తెలిపారు. నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించిందన్నారు. కిషన్‌ రెడ్డి ఏం చేశారని నాపై నిందలు వేయడం తప్ప రేవంత్‌ రెడ్డికి గోదావరి జలాల వినియోగంపై ఏమైనా కార్యాచరణ రూపొందించారా అని నిలదీశారు. తెలంగాణ హక్కులను కాపాడే విషయంలో తాను ఎట్టి పరిస్ధితుల్లో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం సరఫరాలో లోపం ఉంది తప్ప ఎరువుల కొరత లేదని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ బీసీల కొంప ముంచే రిజర్వేషన్లు ఇస్తోందన్నారు. బీసీ సంఘాల నేతలు ఆలోచన చేసుకోవాలని సూచించారు. ఓటు బ్యాంకు ముసుగులో బీసీలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. మహారాష్ట్రలో తెలంగాణ గ్రామాల విలీనం చేయాలంటే పార్లమెంటులో చట్టం చేయాలని, ఇక్కడ ప్రజలు, అక్కడి ప్రజలు ఒప్పుకుంటే పార్లమెంటులో చట్టం చేయడానికి మేము రెడీ అని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story