వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ డిమాండ్‌

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ వ్యవహారంలో కూటమి ప్రభుత్వ వైఖరి ఏంటో స్పష్టంగా చెప్పాలని శాసనమండలిలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన బొత్స సత్యనారాయణ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ జరగదని శాసనమండలి సాక్షిగా పవన్‌ కళ్యాణ్‌, నారాలోకేష్‌లు చెప్పారని అయినా 32 విభాగాలను ఎందుకు ప్రైవేటుపరం చేస్తున్నారని బొత్స ప్రశ్నించారు. ఎన్నికల ముందు కూటమి నేతలు స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ జరగనివ్వమని హామీ ఇచ్చారని కానీ జరుగుతున్నది వేరని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై కూటమి వైఖరి ఏంటో వెల్లడించాలని బొత్స సత్యనారాయణ ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు. ఈ నెల 30వ తేదీన విశాఖపట్నంలో జరిగే జనసేన సమావేశంలో పవన్‌ కళ్యాణ్‌ తన వైఖరిని ప్రకటించాలన్నారు. చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌లకు స్టీల్‌ ప్లాంట్‌ గురించి ప్రధాని నరేంద్రమోడీని అడిగే బాధ్యత లేదా అని బొత్స నిలదీశారు. ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలను కలుపుకుని వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్దయెత్తున పోరాటాలు చేస్తామని బొత్స ప్రకటించారు. త్వరలోనే ఉద్యమ కార్యచరణ ప్రకటిస్తామన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంటును ఎలాగైనా కాపాడుకోవాలని, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి అందరూ కలసి రావాలని బొత్స పిలుపునిచ్చారు.

పించన్ల కోసం రాష్ట్రంలో దివ్యాంగులు ధర్నాలు చేస్తున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, అసలు ఈ ప్రభుత్వానికి మానవత్వమే లేదని బొత్స ఆరోపించారు. మంత్రులు, ఎమ్మెల్యేలపైనా అవినీతి ఆరోపణలు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయని, దోచుకోవడంలో కూటమి నేతలు బిజీగా ఉన్నారని బొత్స విమర్శించారు. ఆరోపణలు వచ్చినప్పుడు చంద్రబాబు సదరు శాసనసభ్యులు, మంత్రులపై సీరియస్‌ అయ్యారని చెపుతారు… కానీ వారిపై ఎటువంటి చర్యలు ఉండవని బొత్స అన్నారు. దోపిడీలు, దౌర్జన్యాలు, భూ కబ్జాలు కూటమి ప్రభుత్వంలో బాగా పెరిగిపోయాయని బొత్స ఆరోపించారు. దివ్యాంగులకు మద్దతుగా వైఎస్‌ఆర్‌సీపీ పోరాటం చేస్తుందని బొత్స సత్యనారణ తెలిపారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story