CM Chandrababu: తీరం మనదే.. వేటా మనదే.. రాజీ లేదు: సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు

మత్స్యకారుల సేవ కార్యక్రమం ప్రారంభం
CM Chandrababu: ‘‘తీరం మనదే.. బోటు మనదే.. వేటా మనదే. ఎవరైనా వస్తే రానివ్వని పరిస్థితి లేదు. భయపడే పని లేదు. ఎవరి కోసమో మన జీవనోపాధి కోల్పోవడం ఎందుకు? మన తీరంపై మనకే హక్కు. పొరుగు రాష్ట్రాలవారు రావడానికి వీలు లేదు. బోటు చొరబడగానే కలెక్టర్‌కు మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చిన వెంటనే అప్రమత్తమవుతాం. ఎవరినీ రానివ్వం’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
నెల్లూరు జిల్లా కావలిలో ‘మత్స్యకారుల సేవ’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా సీఎం మాట్లాడారు. మత్స్యకారుల సమస్యలు, వారి ఆర్థిక అభివృద్ధి, భద్రతపై ఈ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని తెలిపారు.
మత్స్యకారులకు భరోసా.. ఆర్థిక సాయం
మత్స్యకారులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని సీఎం హామీ ఇచ్చారు. వేట నిషేధ సమయంలో ప్రతి కుటుంబానికి రూ.20 వేలు ఆర్థిక భరోసా అందిస్తున్నట్లు తెలిపారు. చరిత్రలో తొలిసారిగా రూ.260 కోట్లు మత్స్యకారుల ఖాతాల్లో జమ చేశామన్నారు.
గతేడాది 1,21,433 కుటుంబాలకు రూ.243 కోట్లు అందించగా, ఈ ఏడాది 1,30,796 కుటుంబాలకు రూ.262 కోట్ల ఆర్థిక సాయం అందించినట్లు వెల్లడించారు.
2014-19 మధ్య మత్స్య సంపద ఉత్పత్తి 19.18 శాతం పెరిగిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. అయితే వైకాపా పాలనలో ఉత్పత్తి నాలుగు రెట్లు పడిపోయిందని విమర్శించారు. వ్యవసాయం, నిర్మాణ రంగాల తర్వాత మత్స్య సంపదపై ఎక్కువ మంది ఆధారపడుతున్నారన్నారు.
రొయ్యలు, సీవీడ్‌తో ఆదాయం
దేశంలో రొయ్యల ఉత్పత్తిలో 80 శాతం ఆంధ్రప్రదేశ్ నుంచే జరుగుతోందని, ప్రపంచం నలుమూలలా ఎగుమతి అవుతున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. సముద్రపు నీటితో సీవీడ్ కల్చర్ చేస్తే భారీ ఆదాయం వస్తుందని సూచించారు. మగవారు వేటకు వెళ్తే, మహిళలు సీవీడ్ పండించి అదనపు ఆదాయం పొందాలని సలహా ఇచ్చారు.
మత్స్యకారుల జీవితాలు మెరుగుపరచడం, వారి కుటుంబాల్లో వెలుగు నింపడం ఈ ప్రభుత్వ బాధ్యత అని సీఎం పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, ఫరూఖ్ తదితరులు పాల్గొన్నారు.

