Rishikonda Beach Buildings : రిషికొండలో జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది
మంత్రులు మనోహర్, దుర్గేష్‌లతో రుషికొండ భవంతులను పరిశీలించిన పవన్ కళ్యాణ్

రిషి కొండలో గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన భవనాలను పర్యాటక ప్రాంతాలుగా ఎలా చేయాలనే విషయాన్ని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. శుక్రవారం మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్‌లతో పవన్ కళ్యాణ్ రుషికొండ భవనాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రెండు బ్లాకులకు 90 కోట్లు ఖర్చుపెట్టి, ఒక బ్లాక్ నిర్మించడం కోసం వైఎస్‌ఆర్సీపీ ప్రభుత్వం 70 కోట్లు ఖర్చుపెట్టిందని వెల్లడించారు. మొత్తం ఏడు బ్లాకులకు గానూ నాలుగు బ్లాకులు మాత్రమే నిర్మించడం జరిగిందని, ఈ నాలుగు బ్లాకుల నిర్మాణానికి 545 కోట్లు ఖర్చు చేశారని వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ విమర్శించారు. గతంలో ఈ భవంతుల వద్దకు మమ్మల్ని రానివ్వలేదని, ఎన్నో అడ్డంకులు సృష్టించారని ఉపముఖ్యమంత్రి తెలిపారు. ఈ ప్రాంతంలో రిసార్టులు ఉన్నప్పుడు ప్రభుత్వానికి సంవత్సరానికి రూ.7 కోట్లు ఆదాయం వచ్చేదని ప్రస్తుతం కరెంటు బిల్లు సంవత్సరానికి రూ.15 లక్షలు అవుతోందని చెప్పారు. ఇప్పటికే జరగాల్సిన డ్యామేజి జరిగిపోయిందని, లోపల పెచ్చులు ఊడిపోతున్నాయని, కొన్ని చోట్ల లీకేజ్ అవుతోందని చెప్పారు. అయితే కూటమి ప్రభుత్వం ఈ భవంతులను టూరిజం కింద ఎలా చేయాలన్నది ఆలోచిస్తున్నామని, ఈ నిర్మాణాలను ఎలా ఉపయోంచాలనే దానిపై ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు.
