Nara Lokesh : 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ కూటమి ప్రభుత్వ లక్ష్యం!
అర్థసమృద్ధి-2005 సమ్మిట్‌లో ఏపీ విద్యాశాఖ మంత్రినారాలోకేష్ ప్రకటన

- నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీలో చార్డర్డ్ ఎకౌంటెంట్లు భాగస్వాములు కావాలి
- అకౌంటింగ్, ఆడిటింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కు ఐసిఎఐ చొరవచూపాలి
- రాబోయే నాలుగేళ్లలో విశాఖ రూపురేఖలు మార్చేసి రుణం తీర్చుకుంటాం
- చార్డర్డ్ అకౌంటెంట్లకు రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి లోకేష్ పిలుపు
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఎపి లోని కూటమి ప్రభుత్వం నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీని నిర్మిస్తోందని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి 2.4ట్రిలియన్ డాలర్లకు చేర్చాలన్నది మా లక్ష్యంగా పెట్టుకున్నట్లు విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఈ ప్రయాణంలో చార్డర్డ్ అకౌంటెంట్లు కంట్రిబ్యూటర్లుగా మాత్రమే కాకుండా మార్గదర్శకులుగా నారా లోకేష్ పిలుపునిచ్చారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఛార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా (ఐసిఎఐ) ఆధ్వర్యంలో అర్థసమృద్ధి – 2025 పేరిట వైజాగ్ కన్వెన్షన్స్ లో జరిగిన సదస్సులో మంత్రి లోకేష్ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ప్రతి పారిశ్రామిక విప్లవానికి రెండు పార్శ్వాలు ఉంటాయి, ప్రతి పారిశ్రామిక విప్లవం కొత్త అవకాశాలను సృష్టిస్తుంది, గతంలో ఐటి విప్లవం వచ్చినపుడు భారతదేశం అత్యధికంగా లబ్ధిపొందింది, అదేతరహాలో ప్రస్తుతం ఎఐ విప్లవంతో లబ్ధిపొందబోతున్నామన్నారు. రాజకీయ పార్టీగా మేం డిజిటల్ లైబ్రరీ, విశ్లేషణాత్మక సమాచారం కోసం ఎఐ వినియోగిస్తున్నాం, అసెంబ్లీలో అర్థవంతమైన చర్చల కోసం ఎఐ టూల్ ను ఉపయోగిస్తాం. ఎఐ ఆధారిత గవర్నెన్స్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషిచేస్తున్నామని నారా లోకేష్ తెలిపారు. సిఎలు ఆంధ్ర ప్రదేశ్ బ్రాండ్ అంబాసడర్‍గా నిలవాలి. టారిఫ్ వార్ కారణంగా భారత్ నష్టపోకుండా కొత్త మార్కెట్లను అన్వేషించాలి. ఈజ్ ఆఫ్ లివింగ్ కు ప్రాధాన్యతనిస్తూ మనమిత్ర ద్వారా 700రకాల పౌరసేవలను వాట్సాప్ ద్వారా అందిస్తున్నాం. పరిపాలన వ్యవహారాల్లో ఎఐ వినియోగానికి సంబంధించి టోనీ బ్లెయిర్ ఇనిస్టిట్యూట్ తో ఒప్పందం చేసుకున్నాం. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు మేం ఏర్పాటుచేసిన వర్కింగ్ గ్రూపులో చేరి మీవంతు సూచనలు, సలహాలు అందించమని లోకేష్ పిలుపునాచ్చారు.
భోగాపురం ఎయిర్ పోర్టుతో అనూహ్య అభివృద్ధి
ఎపిలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాల వల్ల గూగుల్, టిసిఎస్, కాగ్నిజెంట్ వంటి ప్రఖ్యాత సంస్థలు విశాఖకు రాబోతున్నాయి. ఐసిఎఐ అంటే కేవలం బ్యాలెన్స్ షీట్లు సరిచూసే సంస్థ మాత్రమే కాదు, సమసమాజాన్ని నిర్మించే ఒక వేదిక. సిఎలు అంటే కేవలం ఖాతాపుస్తకాలను చూసే ఆడిటర్లు మాత్రమే కాదు, బాధ్యత, జవాబుదారీతనానికి ప్రతిరూపం. బలమైన ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో సిఎలది కీలకపాత్ర. మరో ఏడాదిలో భోగాపురం ఎయిర్ పోర్టు పూర్తవుతుంది, ఆ తర్వాత ఉత్తరాంధ్ర స్వరూపం మారబోతోంది. దీనివల్ల, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు అనూహ్యంగా అభివృద్ధి చెందుతాయి. ప్రస్తుత శాసనసభలో 50శాతం మంది కొత్తవారు, మంత్రివర్గంలో కూడా 17మంది కొత్తవారే. ఆంధ్రప్రదేశ్ ను నెం.1గా తీర్చిదిద్దేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రాభివృద్ధిలో సిఎలు ప్రముఖ పాత్ర పోషించాలి. విశాఖపట్నంలో అకౌంటింగ్, ఆడిటింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఏర్పాటు చేసేందుకు ఐసిఎఐ చొరవచూపాలి.
సిటీ ఆఫ్ డెస్టినీ మాత్రమే కాదు...
మీరు కేవలం రికార్డు కీపర్లు మాత్రమే కాదు... భారతదేశ నిర్మాణ రూపశిల్పులు. విశ్వసనీయమైన గణాంకాలు ఉన్న దేశం అన్నివిధాల అభివృద్ధి సాధిస్తుంది. ఆ విశ్వాసానికి ప్రతిరూపం ఆడిటర్లు. ఈ సమావేశాన్ని సిటీ ఆప్ డెస్టినీ విశాఖపట్నంలో జరపడం సముచితమైన నిర్ణయం. ఆంధ్రప్రదేశ్ కు డీప్ వాటర్ పోర్టు, ఐటి, ఫార్మా, మెడిటెక్ పరిశ్రమలు మణిహారం లాంటివి. చంద్రబాబుగారి విజన్ ప్రకారం విశాఖపట్నం అభివృద్ధి చెందితే యావత్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధిస్తుంది. నేడు విశాఖపట్నం సిటీ ఆఫ్ డెస్టినీ మాత్రమే కాదు... ప్రపంచస్థాయి ఫైనాన్స్, ఇన్నొవేషన్, టెక్నాలజీకి కేంద్రబిందువుగా రూపుదిద్దుకుంటోంది. ఐసిఎఐ ఉపాధ్యక్షుడు ప్రసన్నకుమార్ విశాఖపట్నం వారు కావడం ఆంధ్రప్రదేశ్ లోని సిఎలకు గర్వకారణం. క్రమశిక్షణతో కూడిన ఉత్తమ నాయకత్వానికి ఎల్లలు ఉండవనడానికి ఆయన సాధించిన విజయమే నిదర్శనమని నారాలోకేష్ పేర్కొన్నారు.
