తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్

విశాఖ ఉక్కు ప్లాంట్ ప్రైవేటీకరణపై దుష్ప్రచారానికి తెరదించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ ప్రతిపక్షాలకు హితవు పలికారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్లాంట్ ప్రైవేటైజ్ అవుతుందంటూ వైసీపీకి అనుబంధంగా ఉన్న కొంతమంది నాయకులు, కార్మిక సంఘాల నేతలు చేస్తున్న ప్రచారం పూర్తిగా నిరాధారమని చెప్పారు. విశాఖ ఉక్కు ప్లాంట్ ఎప్పటికీ ప్రైవేటీకరణ కాదని పల్లా స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్టీల్ ప్లాంట్‌ పరిరక్షణలో కీలకపాత్ర పోషించారు అని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.11,440 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.2,600 కోట్లు సమకూర్చి మొత్తం రూ.14,000 కోట్లకు పైగా నిధులు తెచ్చి ప్లాంట్‌కి ఆర్థిక ఊపిరి ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ నిధులతో ముడిసరుకు, విద్యుత్, నీటి అవసరాలు తీర్చేలా భరోసా కల్పించారన్నారు. 1998లో అటల్ బిహారీ వాజ్ పేయి గారు ప్రధాని ఉన్న సమయంలోనూ, విశాఖ ఉక్కు ప్లాంట్ కష్టాల్లో ఉన్నప్పుడు అప్పటి నేతలు కలసి రూ.1,350 కోట్లు తెచ్చి కాపాడిన విషయాన్ని పల్లా గుర్తు చేశారు. అదేవిదంగా నేడు మళ్లీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ భరత్‌ తో పాటు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వ సహకారంతో భారీ నిధులు సమకూర్చినందువల్లే ప్లాంట్‌ మళ్లీ లాభదాయక దిశగా పయనిస్తోందని వివరించారు.

కొందరు కార్మిక సంఘ నేతలు ప్లాంట్ మొత్తం ప్రైవేటీకరణ అవుతుందని సృష్టిస్తున్న అపోహలకు వాస్తవ ఆధారం లేదని పల్లా శ్రీనివాస్‌ తెలిపారు. కొంతమంది కాంట్రాక్ట్ వర్కర్లలను మెరుగైన సేవలు అందించేలా ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం జరిగిందని, ఇది కొత్త విషయం కాదని, గతంలో కూడా ఇదే విధానం కొనసాగిందని తెలిపారు. ప్రస్తుతం ప్లాంట్‌లో 15 వేల మందికి పైగా కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారని, వారి సహకారంతోనే ఉత్పత్తి కొనసాగుతోందని వివరించారు. ప్లాంట్‌లో మూడు బ్లాస్ట్‌ ఫర్నేసులు ఉన్నాయి. అందులో రెండు పూర్తిస్థాయి సామర్థ్యంతో నడిస్తేనే బ్రేక్‌ ఈవెన్‌ సాధ్యమవుతుందని, ప్రస్తుతం పూర్తి సామర్థ్యంతో పని చేయడం వల్ల లాభాల్లోకి ప్రవేశిస్తుందని పేర్కొన్నారు. నెలకు రూ.240 కోట్ల జీతభత్యాల భారం ఉన్నప్పటికీ, పూర్తి స్థాయి ఉత్పత్తితోనే నెలకు రూ.100 నుండి రూ.200 కోట్లు లాభాలు సాధ్యమని వివరించారు. ఇకనైనా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు ఆపాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక శాసనసభ్యుడు పల్లా శ్రీనివాస్‌ తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story