CR Media Academy : అమరావతిపై విష ప్రచారాన్ని తిప్పికొట్టాలి
సీఆర్ మీడియా అకాడమీ చైర్మన్ పిలుపు

రాజధాని నిర్మిస్తున్నారు అంటే అందరూ ముందుకు వచ్చి ప్రోత్సహిస్తారని కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఆ పరిస్ధితి లేదని సముద్రాల రాఘవాచారి మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ అన్నారు. అమరావతిపై అబద్దపు ప్రచారం… భావ ప్రకటనా స్వేచ్ఛ అనే అంశంపై ఏపీ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో గురువారం సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ మాట్లాడుతూ రాష్ట్ర విభజనతో ఆంధ్ర ప్రజలు రాజీ పడ్డారన్న సురేష్ ఆనాటి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రారంభించిందని గుర్తు చేశారు. అయితే అప్పుడ ఎవరూ అమరావతికి అడ్డు చెప్పలేదని కానీ 2019 తరువాత అమరావతికి అరిష్టం మొదలయ్యిందన్నారు. అమరావతి ముంపు ప్రాంతమని, రివర్స్ టెండరింగ్ అని, అమరావతి రాజధానిగా పనికిరాదని ప్రచారం చేశారని చెప్పారు. మన రాజధానిని మనం ప్రేమించుకోలేమా ఎందుకు బురదచల్లడం అని ఆయన ప్రశ్నించారు. అయితే అమరావతి విషయంలో కోర్టులు కూడా అక్కడ రాజధాని నిర్మించుకోవచ్చని తీర్పులు ఇచ్చాయని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చినా అమరావతిపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆలపాటి సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు అమరావతి మునిగిపోయిందని ప్రచారం చేశారని… అదేమని ప్రశ్నిస్తే భావ ప్రకటనా స్వేచ్ఛ అంటున్నారని విస్మయం వ్యక్తం చేశారు. రాజ్యాంగంలోనే భావప్రకటనా స్వేచ్ఛకు కొన్ని పరిమితులు పెట్టారని ఆలపాటి సురేష్ తెలిపారు. నిజానికి మసి పూసి ప్రచారం చేసే హక్కు మనకు రాజ్యాంగం కల్పించిందా అని ఆయన ప్రశ్నించారు. కొన్ని మీడియా సంస్ధల్లో కూడా ఈ ప్రచారం నడుస్తోందని, కానీ భారత రాజ్యాంగంలో మీడియా స్వేచ్ఛ అని ఏమీ లేదన్నారు. మీడియా కూడా రాజ్యాంగానికి లోబడి ఉండాల్సిందే అని ఆలపాటి సురేష్ స్పష్టం చేశారు. ఇటువంటి ప్రచారం చేసేవారి ప్రధాన ఉద్దేశం అమరావతిని నీరుగార్చమే అన్నారు. అమరావతిపై దుష్ప్రచారం విషయంలో తెలియక కొంత మంది భాగస్వామ్యం అవుతున్నారని వాళ్ళ కూడా ఫ్యాక్ట్‌చెక్ చేసుకోవాలని ఆలపాటి సురేష్ సూచించారు. ఫాక్ట్ చెక్ చేయాల్సిన మీడియా కూడా ఆ పని చేయట్లేదు కాబట్టి.. మనం ముందుకు రావాల్సిన అవసరం ఉందని సీఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ పేర్కొన్నారు.
