Andhra Pradesh : యూరియా,డిఏపి ఎరువులు అవసరానికి సరిపడిన నిల్వలున్నాయి
వ్యవసాయశాఖ అధికారులకు స్పష్టం చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్

- ఈనెలకు 1.65 లక్షల మె.ట.యూరియా అవసరం కాగా 2లక్షల టన్నులు ఉంది
- డిఏపి 70వేల టన్నులు అవసరం ఉండగా 88వేల టన్నులు ఉంది
- యూరియా వ్యవసాయేతర అవసరాలకు మళ్ళించకుండా చూడండి
- ఎరువులను దారిమళ్ళించకుండా ఆకస్మిక తనిఖీలు నిర్వహించండి
రాష్ట్రంలో ప్రస్తుతం రైతుల అవసరం మేరకు తగిన యూరియా,డిఏపి ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని కావున రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ స్పష్టం చేశారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుండి ఆయన వ్యవసాయశాఖ అధికారులతో కలిసి జిల్లా కలక్టర్లతో ఈ విషయమై వీడియో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఆగష్టు మాసానికి లక్షా 65 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా ప్రస్తుతం క్షేత్ర స్థాయిలో 2లక్షల 4వేల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని అన్నారు.అదే విధంగా డిఏపి 70 వేల మెట్రిక్ టన్నులు అవసరం ఉండగా ప్రస్తుతం 88 వేల 248 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉందని కావున రైతులు ఎవరూ ఎరువుల కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సిఎస్ స్పష్టం చేశారు.
కాగా సబ్సిడైజ్డ్ యూరియాను అనగా ఎజియు(అగ్రిగ్రేడ్ యూరియా)పారిశ్రామిక అవసరాలకు అనగా ఫ్లైఉడ్, పెయింట్స్, యాడ్ బ్లూ మాన్యుప్యాక్చరింగ్,పశు,కోళ్ళ పరిశ్రమల యూనిట్లు,ఆక్వా రైతులు దానా కోసం వినియోగించేందుకు దారి మళ్ళించ కుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సిఎస్ విజయానంద్ జిల్లా కలక్టర్లను ఆదేశించారు. ఇందుకు సంబంధించి జిల్లా స్థాయిలో వ్యవసాయ సంబంధిత శాఖల అధికారులతో వెంటనే కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించి రైతులకు పూర్తి స్థాయిలో ఎరువులు అందుబాటులో ఉండే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతేగాక అక్కడక్కడా ఆకస్మిక తనిఖీలు చేపట్టి యూరియా దారి మళ్ళకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం అన్నధాత సుఖీభవ-పియం కిసాన్ కు సంబంధించి ఎన్పిసిఐ ఇన్ యాక్టివ్ మరియు ఇ-కెవైసి మ్యాపింగ్ కాని రైతుల ఖాతాలను వేగవంతంగా మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేసి అర్హులైన రైతులందరికీ ఆనిధులు జమ అయ్యేవిధంగా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలక్టర్లను సిఎస్ విజయానంద్ ఆదేశించారు. ఈవీడియో సమావేశానికి వర్చువల్ గా పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ మాట్లాడుతూ సబ్సిడైజ్డ్ యూరియా వ్యవసాయేతర అవసరాలకు దారి మళ్ళించకుండా కలక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.అంతకు ముందు వ్యవసాయశాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్రంలో ఎరువుల లభ్యత గురించి వివరించారు. ఈసమావేశంలో జిల్లా కలక్టర్లు వర్చువల్ గా పాల్గొన్నారు.
