BYC Party Ramachandra yadav : మీ ఉడత బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు
బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్రయాదవ్ సెన్సేషనల్ కామెంట్స్

- ఎన్టీఆర్ విగ్రహం తొలగించడానికి సహకరించి నారా లోకేష్‌కు, గ్రామస్తులకు కృతజ్ఞతలు
- అధికార పార్టీ పేరుతో తప్పుడు కేసులో పెడతామని బెదిరిస్తున్నారు
- కొందరు శ్రీకృష్ణ భగవానుడిపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు
- తెలుగు రాష్ట్రాలలో కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలు తొలగించేలా న్యాయపోరాటం
గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులో శ్రీకృష్ణుడి రూపంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించడానికి సహకరించిన మంత్రి నారా లోకేష్, నిర్వాహకులు, గ్రామస్తులకు, ఈ విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తూ స్పందించిన హిందూ సంఘాలు, బిసి సంఘాల ప్రతినిధులకు బిసివై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. మంగళగిరిలోని బిసివై పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తక్కెళ్లపాడులో శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న విషయం తెలుసుకున్న హిందూ, యాదవ సంఘాలు పెద్ద ఎత్తున వ్యతిరేకించాయన్నారు. తాను కూడా తక్కెళ్లపాడుకు వెళ్లి విగ్రహం ఏర్పాటు చేయవద్దని నిర్వాహకులకు చెప్పి వస్తే... విగ్రహం పెట్టబోమని ప్రకటించి మళ్లీ రాత్రికి రాత్రే విగ్రహాన్ని ఏర్పాటు చేశారన్నారు. దీంతో తాను విశాఖపట్న నుంచి ఛలో తక్కెళ్లపాడుకు పిలుపునిచ్చానన్నారు. దీంతో వివాదాన్ని గుర్తించిన నారా లోకేష్ జోక్యంతో నిర్వాహకులు బేషజాలకు పోకుండా శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించి, ఎన్టీఆర్ రూపంలోనే విగ్రహాన్ని ఏర్పాటు చేశారన్నారు. వారందరికీ రామచంద్రయాదవ్ కృతజ్ఞతలు తెలిపారు.
వివాదాస్పద ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటును వ్యతిరేకించిన తనపై కొందరు బెదిరింపులకు దిగుతున్నారని రామచంద్రయాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు కేసులు పెడతామని, కుట్ర చేస్తామని బెదిరిస్తున్నారని, అలాంటి ఉడత బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. మంగళగిరి పార్టీ ఆఫీసుకు వస్తామని కొందరు తనను టార్గెట్ చేసి మాడ్లాడుతున్నారని వాటన్నిటికీ బెదిరే ప్రసక్తే లేదన్నారు. కొందరు పనిగట్టుకొని శ్రీకృష్ణుడిని అవమానించే విధంగా మాట్లాడుతున్నారని రామచంద్రయాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడో తెలుసా? అని... రామారావు వల్లే శ్రీకృష్ణుడికి ప్రాచుర్యం వచ్చిందనే అర్థం వచ్చేలా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారన్నారు. అలా మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై చర్యలు తీసుకోవాలని రామచంద్రయాదవ్ డిమాండ్ చేశారు.
ఈ విష సంస్కృతి నశించాలి
దేవుళ్ల రూపంలో నటుల విగ్రహాల ఏర్పాటు చేసే సంస్కృతి నశించాలని రామచంద్ర యాదవ్ డిమాండ్ చేశారు. ఇప్పుడు శ్రీకృష్ణుడు రూపంలో ఎన్టీఆర్ విగ్రహాలు పెట్టాలని ప్రయత్నించినట్టుగానే, శివుడి రూపంలో చిరంజీవిని, అమ్మవారి రూపంలో రమ్యకృష్ణ విగ్రహాలను ప్రతిష్టించినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఎద్దేవా చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ విష సంస్కృతి నశించాలని కోరారు. రెండు తెలుగు రాష్ట్రాలలో గతంలో శ్రీకృష్ణుడు రూపంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాలను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఇద్దరు సిఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలకు రామచంద్రయాదవ్ విజ్ఞప్తి చేశారు. అలాగే ఆ విగ్రహాల తొలగింపుకు త్వరలోనే కోర్టులను ఆశ్రయించి న్యాయ పోరాటం చేస్తామన్నారు. రామారావు విగ్రహాల ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని, మనోభావాలను కించ పరిచేలా ఏర్పాటు చేస్తే చూస్తూ ఊరుకునే పరిస్థితి మాత్రం లేదని బోడే రామచంద్రయాదవ్ తేల్చి చెప్పారు.
