YS Sharmila’s Sharp Allegation: వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పేరు చెప్పి ప్యాలెస్‌లు కట్టుకొని, రాష్ట్రాన్ని దోచుకున్నారని వైకాపా నేతలపై కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తీవ్రంగా ఆరోపించారు. ఇంట్లో కూర్చొని బటన్‌ నొక్కి, పాదయాత్ర చేసినంత మాత్రాన వైఎస్‌ వారసులు కారని ఆమె దుయ్యబట్టారు.

విజయవాడలో మంగళవారం కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొంతమంది నేతలు కాంగ్రెస్‌లో చేరారు. సమావేశంలో మాట్లాడిన షర్మిల, వైఎస్‌ ఆశయాలు, సిద్ధాంతాలను అనుసరించేవారే ఆయన నిజమైన వారసులని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ను బలోపేతం చేయడం ద్వారా వైఎస్‌ ఆశయాలను నిలబెట్టడమే తన లక్ష్యమని పేక్కించారు.

“వైఎస్‌ సులువుగా సీఎం కాలేదు. అయ్యాక కూడా ఎంతో కష్టపడ్డారు. ఈ మధ్యకాల నాయకులు ఒక్కసారి సీఎం అయితే ప్రజలకు అందుబాటులో ఉండరు. సొంత పార్టీ నాయకులకు కూడా కనపడరు. సీఎం ఎలా ఉండాలో వైఎస్‌ ఆదర్శం చూపించారు” అని షర్మిల వ్యాఖ్యానించారు.

రాహుల్‌ గాంధీని ప్రధానమంత్రి చేయాలని వైఎస్‌ కోరుకున్నారని, ఆ కలను నిజం చేయడానికే తాను కాంగ్రెస్‌లో ఉన్నానని ఆమె తెలిపారు. వైఎస్‌ బతికి ఉంటే రాష్ట్ర విభజన జరిగేది కాదని, తెలంగాణ ఉద్యమంలో ఎక్కువ మంది చనిపోకూడదనే ఉద్దేశ్యంతో కాంగ్రెస్‌ రాష్ట్రాన్ని విభజించిందని ఆమె అన్నారు.

సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు, జేడీ శీలం, ఏఐసీసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు, పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, మస్తాన్‌వలీ తదితరులు పాల్గొన్నారు.

ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story