ZPTC By Polls : బయటి గ్రామాల నుంచి వేల సంఖ్యలో దొంగ ఓటర్లు
పోలింగ్ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డ ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి

- పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేయించిన కూటమి నేతలు..
- జమ్మలమడుగులో మీడియాతో మాట్లాడిన వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి
- టీడీపీ గూండాలు ఏజెంట్లను కొట్టి వారి వద్ద ఉన్న ఫారాలను చించేశారు..
- టీడీపీ వారితోనే ఉన్న పోలీసులు కూడా బెదిరించారు..
- ఏజెంట్లుగా కూర్చోనివ్వాలని మహిళలు పోలీసుల కాళ్ళు పట్టుకుని ప్రాదేయపడ్డారు..
- ప్రజాస్వామ్యానికి బదులు చంద్రబాబు రౌడీయిజంను నమ్ముకున్నారు..
- గ్రామాల్లో టీడీపీ నేతల నేతృత్వంలో వందల మంది బయటి వ్యక్తులు తిష్ట..
- ఓటర్లను పోలింగ్ బూత్ లకు రానివ్వకుండా కర్రలు, కత్తులతో పహారా..
- టీడీపీ నేతలు, కార్యకర్తలే దొంగ ఓట్లు వేసేందుకు క్యూలైన్లలో నిలబడ్డారు..
- వారికి అండగా పోలీసులు రక్షణ కల్పిస్తున్నారు..
- ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆగ్రహం.
పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలతోనే కూటమి పార్టీల పతనం మొదలయ్యిందని వైయస్ఆర్‌సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి మండిపడ్డారు. జమ్మలమడుగులో మీడియాతో మాట్లాడుతూ ఈ రెండు స్థానాల్లో టీడీపీ మంత్రలు, ఎమ్మెల్యేలు, నాయకులు తమ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున దొంగ ఓటర్లను తీసుకువచ్చి పోలింగ్ కేంద్రాల్లో ఓట్లు వేయించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెల్లవారుజాము నుంచే టీడీపీ గూండాలు వందల సంఖ్యలో ఆయా గ్రామాల్లో మోహరించి, ఓటర్లను కర్రలు, కత్తులతో బెదిరించి వారి నుంచి ఓటర్ స్లిప్‌లను లాక్కున్నారని అన్నారు. పోలీసుల అండతో వైయస్ఆర్‌సీపీ నేతలను బయటకు రానివ్వకుండా, ఏకపక్షంగా ఈ ఎన్నికల్లో గెలిచేందుకు సీఎం చంద్రబాబు డైరెక్షన్‌లో టీడీపీ అరాచకానికి పాల్పడుతోందని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యాన్ని కాకుండా, రౌడీయిజంతోనే ఈ ఎన్నికల్లో గెలవాలన్నదే చంద్రబాబు లక్ష్యంగా కనిపిస్తోందని దుయ్యబట్టారు. తమను ఎజెంట్లు కూర్చునేందుకు అనుమతించాలంటూ మహిళలు పోలీసుల కాళ్ళు పట్టుకుని వేడుకుంటున్నారంటేనే ఈ ఎన్నికలు ఎంత నిరంకుశంగా జరుపుతున్నారో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే...
పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి తెలుగుదేశం పార్టీ అధికార దుర్వినియోగంతో పోలీసుల సహకారంతో ఏకపక్షంగా గెలవాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. ప్రజాస్వామ్యయుతంగా గెలిచే ధైర్యం లేక అడ్డదోవలు తొక్కుతున్నారు. సుపరిపాలన అంటూ ప్రచారం చేసుకుంటున్న కూటమి ప్రభుత్వం ప్రజాతీర్పును స్వేచ్ఛగా కోరేందుకు ఎందుకు భయపడుతోంది. కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతూ ప్రజల చీత్కారాలకు గురవుతున్నారు. ఎన్నికలకు ముందు ప్రకటించిన సూపర్ సిక్స్‌లో ఒక్క హామీని కూడా పూర్తిగా పదిహేను నెలల్లో అమలు చేయలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. తొలి ఏడాది తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి పథకాలను పూర్తిగా ఎగ్గొట్టి, రెండో ఏడాది అరకొరగా అమలు చేస్తున్నారు. మహిళలకు నెలకు రూ.1500 చొప్పున ఇస్తామన్న హామీపై నేటికీ అతీగతీ లేదు, నిరుద్యోగభృతి, యాబై ఏళ్ళకే పెన్షన్ ఇలా ఏపథకం చూసినా అమలు అనేది కనిపించడం లేదు. చివరికి రైతులకు ఎరువులను కూడా అందించలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ప్రజలకు, రైతులకు అండగా నిలిచిచేందుకు వైయస్ జగన్ ఎక్కడికి వెళ్ళినా ప్రజలు పెద్ద ఎత్తున ఆయన వెంట నిలుస్తున్నారు. దీనిని చూసి కూటమి ప్రభుత్వం భయపడిపోతోంది.
ప్రజలను చూసి భయపడుతున్న కూటమి సర్కార్
ప్రజలను చూసి కూటమి సర్కార్ భయపడుతోంది. పులివెందుల, ఒంటిమిట్టలో స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరిగితే తమకు డిపాజిట్లు కూడా దక్కవని కంగారు పడుతున్నారు. కూటమి ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు పులివెందుల్లో మోహరించారు. పోలీసులను పూర్తిగా తమకు అనుకూలంగా పనిచేయించుకుంటున్నారు. పులివెందుల మండలంలో టీడీపీ నేతలను, కార్యకర్తలను ఉంచి, వైయస్ఆర్‌సీపీ వారిని మాత్రం బయటకు పంపించారు. బయటి నుంచి పెద్ద ఎత్తున దొంగ ఓటర్లను తీసుకువచ్చి తమకు అనుకూలంగా ఓట్లు వేయించుకుంటున్నారు. టీడీపీ నాయకులు తమతో పాటు వేల మందిని బయటి నుంచి తీసుకువచ్చి, ప్రతి ఊరిలో ఓటర్లను భయపెట్టి వారి నుంచి స్లిప్‌లను తీసుకుని, తమతో వచ్చిన వారితో ఓట్లు వేయిస్తున్నారు. ఆర్.తుమ్మలపల్లిలో ఎనిమిది వందల మంది రాత్రికి రాత్రే వచ్చారు. గ్రామంలోకి వైయస్ఆర్‌సీపీ వారు, ఏజెంట్లు బయటకు రానివ్వకుండా భీభత్సం సృష్టించారు. ఏజెంట్లను కొట్టి, వారి వద్ద ఉన్న ఏజెంట్ ఫారాలను చించేశారు. కొత్తపల్లిలో బీటెక్ రవి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బయటి ప్రాంతాల నుంచి వచ్చిన వారు వైయస్ఆర్‌సీపీకి చెందిన ఏజెంట్ల ఇళ్ళను చుట్టుముట్టి, కర్రలు, కత్తులతో భయటకు వస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారని, పోలీసులు అక్కడే వుండి వారికే మద్దతుగా మాట్లాడుతున్నారని ఫోన్లు చేసి వాపోయారు. నల్లపురెడ్డి పల్లిలో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి స్వయంగా తన అనుచరులను వెంటపెట్టుకుని రౌడీయిజం చేశాడు. జమ్మలమడుగు నుంచి దొంగ ఓటర్లను తీసుకువచ్చి, దగ్గరుండి ఓట్లు వేయించాడు. దానికి సంబంధించిన ఫోటోలను కూడా ఈ సందర్భంగా మీడియా ముఖంగా ప్రజలు చూసేందుకు ప్రదర్శిస్తున్నాం. కర్మలవాడ పల్లి సర్పంచ్ పుల్లారెడ్డి, నవాబ్ పేటకు చెందిన అచ్చెన్న, కిష్టోఫర్, గుడంచెర్లు శివారెడ్డి, నాగేశ్వరరెడ్డి, మల్లికార్జున్ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది టీడీపీ, బీజేపీ కార్యకర్తలు పోలింగ్ బూత్ లైన్లలో ఉండి మరీ దొంగ ఓట్లు వేశారు. ఒక్కో గ్రామానికి నలుగు నుంచి అయిదు వందల మంది బయటి వ్యక్తుల పోలింగ్ కేంద్రాల వద్ద నిలబడి ఓట్లు వేశారు.
ఆదినారాయణ రెడ్డి అరాచకానికి అడ్డే లేదు
కూటమి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసేదంతా ఫ్యాక్షన్ రాజకీయం. పోలీసుల అండ ఉండబట్టే ఇలా అరాచకానికి పాల్పడుతున్నారు. పోలీసులు లేకుండా ఆదినారాయణరెడ్డి పులివెందుల మండలంలో తిరిగే ధైర్యం ఉందా.? ఒక గ్రామం ఓట్లను వేరే గ్రామంలోని పోలింగ్ కేంద్రాల్లో వేయాల్సిన పరిస్థితిని తీసుకువచ్చి, ఆయా గ్రామాల నుంచి ఎవరూ బయటకు రానివ్వకుండా, బయటి నుంచి తీసుకువచ్చిన వారితో ఓట్లు వేయిస్తున్నారు. పోలీసులు చెక్‌పోస్ట్‌లు పెట్టి, ఓటర్లను రానివ్వకుండా చేస్తున్నారు. పులివెందుల్లో వైయస్ జగన్‌ను అడ్డుకుంటానని హామీ ఇచ్చే ఆదినారాయణ రెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆదినారాయణ రెడ్డిని టీడీపీలో చేర్చుకున్నందుకు 2019 లో పదికి పది స్థానాలు తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. విలువలు లేని రాజకీయాలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేక రౌడీయిజం మీద కూటమి ప్రభుత్వం ఆధారపడింది.
