50 కేజీల బంగారం మాయం!

Sri Govindaraja Swamy Temple: తిరుమలతో పాటు తిరుపతిలోనూ వైకాపా పాలన కాలంలో అవినీతి ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి. శ్రీ గోవిందరాజస్వామి ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం పనుల్లో భారీ అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విజిలెన్స్ విభాగం లోతైన విచారణ చేపట్టింది. దాదాపు 50 కిలోల బంగారం మాయమైందనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. అదనంగా, గోపురంపై ఉన్న 30 విగ్రహాలు ధ్వంసం చేయబడ్డాయనే విషయం కూడా బయటపడింది.

బంగారు తాపడం పనుల్లో మాయాజాలం

శ్రీ గోవిందరాజస్వామి ఆలయం తిరుపతిలో అత్యంత ప్రాచీనమైనది, ప్రముఖమైనది. 2022-23 మధ్య వైకాపా హయాంలో ఈ ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం పనులు చేపట్టారు. ఈ పనుల కోసం టీటీడీ 100 కిలోల బంగారాన్ని కేటాయించింది. నిబంధనల ప్రకారం తొమ్మిది పొరల (లేయర్లు)తో బంగారు తాపడం చేయాల్సి ఉండగా, కేవలం రెండు పొరలతోనే పనులు పూర్తి చేసి మిగతా సగం బంగారాన్ని దారి మళ్లించినట్టు ఆరోపణలు ఉన్నాయి.

అంతేకాకుండా, విమాన గోపురంపై ఉన్న 30 విగ్రహాలను ధ్వంసం చేసి, ఆ తర్వాత బంగారు తాపడం పనులు నిర్వహించారనే ఆరోపణలు అప్పటి నుంచే వినిపిస్తున్నాయి. ఈ విషయాలు బయటకు రాకుండా అప్పటి టీటీడీ ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి జాగ్రత్తలు తీసుకున్నారనే సమాచారం ఉంది.

పనులను అసలు కాంట్రాక్టర్‌కు కాకుండా సబ్‌కాంట్రాక్ట్ ద్వారా వేరే వ్యక్తులకు అప్పగించారనే ఫిర్యాదులు కూడా దేవస్థానానికి అందాయి. ప్రస్తుతం టీటీడీ విజిలెన్స్ విభాగం ఈ అంశాలపై లోతుగా దర్యాప్తు చేస్తోంది. అప్పటి ఫిర్యాదుదారుల నుంచి వివరాలు సేకరిస్తూనే, పనులు చేసిన కార్మికులను విచారిస్తోంది. ఎన్ని విగ్రహాలు ధ్వంసమయ్యాయి? బంగారం ఎంత వినియోగమైంది? అనే కీలక అంశాలపై ఆరాతీస్తోంది.

తిరుమలలో పరకామణి చోరీ, కల్తీ నెయ్యి, వస్త్రాల కొనుగోళ్లలో అవినీతి ఆరోపణలపై ఇప్పటికే విచారణలు జరుగుతున్న నేపథ్యంలో ఈ కొత్త ఆరోపణలు మరింత కలకలం రేపుతున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story