విశాఖలో రూ.13.5 కోట్లతో ఆధునీకరించిన యాత్రినివాస్‌ హోటల్‌ని ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్‌

  • ఆర్కే బీచ్ దగ్గర టూరిజం సీఆర్వో కౌంటర్ ను ప్రారంభించిన మంత్రి దుర్గేష్
  • 5-7 సెప్టెంబర్ లో జరగనున్న వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్ - 2025 బ్రోచర్ ఆవిష్కరించిన మంత్రి
  • రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ.12,000 కోట్ల పర్యాటక పెట్టుబడులతో పర్యాటకాభివృద్ధికి శ్రీకారం

ఏడాది కాలంలో పర్యాటక రంగంలో దాదాపు 12,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని, తద్వారా రాష్ట్రవ్యాప్తంగా అనేక కట్టడాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. శనివారం విశాఖపట్నం ఎంవీపీ కాలనీలోని అప్పుఘర్ వద్ద ఆధునికీకరణ పనులు పూర్తి చేసుకొని పర్యాటకుల సౌకర్యార్థం సిద్ధమైన హరిత హోటల్(యాత్రినివాస్) ను మంత్రి దుర్గేష్ ప్రారంభించారు. యాత్రి నివాస్ లో జరిగిన పనులను, ఏసీ సూట్‌, ఏసీ డీలక్స్‌, ఏసీ ఎగ్జిక్యూటివ్‌ రూమ్‌లు, మీటింగ్ హాల్ ను, బార్ అండ్ రెస్టారెంట్ ను పరిశీలించారు. పర్యాటక శాఖ అధికారులు, సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి దుర్గేష్ మాట్లాడారు. అంతకుముందు ఆర్కే బీచ్ దగ్గర టూరిజం సీఆర్ వో కౌంటర్ ను మంత్రి దుర్గేష్ ప్రారంభించారు. తద్వారా పర్యాటకులు ఆర్కే బీచ్ నుండి తొట్లకొండ వరకు ప్రయాణించే హాప్ ఆన్ హాప్ ఆఫ్ డబుల్ డెక్కర్ బస్సుల టికెట్లు బుకింగ్ చేసుకోవచ్చన్నారు. అనంతరం సెప్టెంబర్ 5-7 వరకు జరగనున్న వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్ - 2025 బ్రోచర్ ను మంత్రి దుర్గేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఏపీటీడీసీ పరిధిలోని హోటళ్లు, రిసార్ట్స్ లలో సరైన వసతి సౌకర్యాలు ఉండేలా మరింత ఆధునికీకరించి ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. అంతేగాక కొన్ని పర్యాటక ప్రాంతాలను కలుపుతూ టూరిజం హబ్, టూరిజం సర్క్యూట్ లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్ నర్ షిప్ విధానంలో పర్యాటకాభివృద్ధి చేస్తున్నామన్నారు. ఇప్పటికే చాలా మంది ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తున్నారని ఈ క్రమంలో అనేక సంస్థలకు ఆహ్వానం పలికామన్నారు. తద్వారా పర్యాటకులు రెండు మూడు రోజులు పర్యాటక ప్రాంతాల్లో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

పర్యాటకుల గమ్యస్థానంగా విశాఖ:మంత్రి కందుల దుర్గేష్

ఏపీ పర్యాటక రంగం అనగానే ముందుగా విశాఖపట్టణం గుర్తొస్తుందని మంత్రి దుర్గేష్ అన్నారు. విశాఖకు వచ్చే పర్యాటకుడు అరకువ్యాలీ, సింహాచలం, అరసవల్లి, స్థానికంగా ఉండే ప్రాంతాలు చూసేలా సర్క్యూట్ లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. స్థానికంగా స్టార్ హోటళ్ల ఏర్పాటు కోసం ఇప్పటికే ఒబెరాయ్, మేఫేర్, ఐఆర్ సీటీసీలతో ఎంవోయూలు కుదుర్చుకున్నామని వెల్లడించారు. నోవాటెల్ తదితర హోటళ్లు మరింత అభివృద్ధికి ముందుకు వస్తున్నాయన్నారు. విశాఖలో అరకువ్యాలీ లాంటి కనువిందైన ప్రాంతాలున్నాయని తెలిపారు. టూరిజం ప్రాజెక్టులో భాగంగా పర్యాటకులను ఆకట్టుకునేలా విశాఖ బీచ్ రోడ్డులో నడిపే రెండు హాప్ ఆన్ హాప్ ఆఫ్ డబుల్ డెక్కర్ బస్సులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ప్రారంభించామని మంత్రి దుర్గేష్ తెలిపారు. 14 టూరిస్ట్ పాయింట్లు పర్యాటకులు సందర్శించేలా ప్రణాళిక చేశామన్నారు. మొదట్లో రూ.500 టికెట్ ధర ఉండాలని నిర్ణయించామన్నారు. కానీ సీఎం చంద్రబాబునాయుడు పెద్దలకు రూ.250, చిన్న పిల్లలకు రూ.100 టికెట్ ధర ఉంచాలని ఆదేశించారన్నారు. తద్వారా ఉదయం రూ.250 టికెట్ తీసుకున్న పర్యాటకులు రోజంతా బస్సులో ప్రయాణించవచ్చన్నారు. ఇతర దేశాల, రాష్ట్రాల పర్యాటకులు సైతం రాష్ట్రానికి వచ్చేలా ఏపీని పర్యాటకుల గమ్యస్థానంగా మారుస్తున్నామన్నారు. కార్యక్రమంలో విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్, నగర మేయర్ పీలా శ్రీనివాస్ రావు, కార్పొరేటర్లు, టూరిజం శాఖ సీఈ వెంకటరమణ, ఎస్ ఈ ఈశ్వరయ్య, రీజినల్ డైరెక్టర్ జివీబీ జగదీష్, జిల్లా పర్యాటక శాఖ అధికారి జయమాధవి, పర్యాటక శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story