ఎక్సైజ్ శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

  • పేదల జేబులు గుల్ల కాకూడదు...ఆరోగ్యం దెబ్బతినకూడదు
  • అందుకోసమే దేశంలో ఎక్కడా లేని విధంగా మద్యం ధరల తగ్గింపు
  • కొత్త విధానంతో అక్రమ మద్యానికి చెక్....పెరిగిన ప్రభుత్వం ఆదాయం

మద్యం విధానంలో పారదర్శకతే ప్రధానమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టం చేశారు. ఈ అంశంపై ఎలాంటి రాజీ లేదని ఆయన తేల్చి చెప్పారు. అబ్కారీ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అనుమానాస్పదంగా ఉన్న బ్రాండ్ల విక్రయాలన్నీ నిలిపివేయాల్సిందిగా ఆయన ఆదేశాలు జారీ చేశారు. జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లు, నాణ్యత ఉన్న మద్యం విక్రయాలు మాత్రమే జరగాలని ఆయన అధికారులకు తేల్చి చెప్పారు. ప్రజల ఆరోగ్యం కంటే ఏదీ ముఖ్యం కాదని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, నాటు సారా విక్రయాలు జరగడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ప్రజారోగ్యంపై ప్రభావం పడకుండా నాణ్యమైన మద్యాన్ని మాత్రమే విక్రయించేలా చూడాలని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున నకిలీ బ్రాండ్లు విక్రయాలు ఆంధ్రప్రదేశ్ లో జరిగాయని తద్వారా ప్రజల ఆరోగ్య పాడైందని అన్నారు.

గత ప్రభుత్వ హయాంలో విక్రయించిన నకిలీ మద్యం బ్రాండ్లను ఎంత వరకు అరికట్టారని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను అడిగి తెలుసుకున్నారు. నాసిరకమైన బ్రాండ్లు ఇంకా ఏమైనా మార్కెట్ లో కొనసాగుతున్నాయా అని సీఎం ఆరా తీశారు. గతంలో విస్తృత స్థాయిలో విక్రయించిన అనామక మద్యం బ్రాండ్లు నూతన పాలసీ అమలు పూర్తిగా తగ్గినట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రస్తుతం అన్ని ప్రముఖ బ్రాండ్లు ఇప్పుడు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయని వివరించారు. గతంలో మార్కెట్లో 68 శాతం మేర అనామక బ్రాండ్లకు చెందిన మద్యమే అందుబాటులో ఉండేదని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఆ నాసిరకం బ్రాండ్ల విక్రయం జరక్కుండా చూస్తున్నామని అధికారులు సీఎంకు తెలియచేశారు. దేశీయ, విదేశీ కంపెనీలకు చెందిన ప్రముఖ బ్రాండ్లన్నీ ఏపీ మార్కెట్ లో కొనుగోలు దారులకు అందుబాటులో ఉన్నాయని వివరించారు. అలాగే పర్మిట్ రూంలు లేకపోవడం వల్ల ఎక్కడ పడితే అక్కడ మద్యం తాగుతున్నారని...ఇది సమస్యలకు కారణం అవుతుందని అధికారులు వివరించారు. దీన్ని నివారించేందుకు పెద్ద ఎత్తున కేసులు నమోదు చేస్తున్నా...పూర్తి గా నివారించ లేకపోతున్నామని...పర్మిట్ రూంలు ఇచ్చి...అక్కడి వరకే పరిమితం చేస్తే మంచిది అధికారులు వివరించారు. అలాగే పర్యాటక రంగానికి ఊతమిచ్చేందుకు ఆస్కారం ఉన్న ప్రాంతాల్లోనూ మైక్రో బ్రూవరీలను అనుమతించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story