ప్రమాదకర 'లబ్సా' రసాయనం వాడకం

TTD Adulterated Ghee Case: తిరుమల తిరుపతి దేవస్థానాలు (టీటీడీ)కు వైకాపా హయాంలో కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో కొత్త సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ప్రమాదకర రసాయనం 'లబ్సా' (లీనియర్ ఆల్కైల్ బెంజీన్ సల్ఫోనిక్ యాసిడ్)ను కల్తీ నెయ్యి తయారీలో వినియోగించినట్లు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) అభియోగపత్రంలో స్పష్టమైంది.

లబ్సా అనేది వాషింగ్ పౌడర్లు, లిక్విడ్ డిటర్జెంట్లు, ఫ్లోర్ క్లీనర్లు, టాయిలెట్ క్లీనర్లు, పారిశ్రామిక క్లీనింగ్ ఏజెంట్ల తయారీలో వాడే అత్యంత ప్రమాదకర రసాయనం. పురుగుమందులు, క్రిమిసంహారకాల్లో ఎమల్సిఫయర్‌గా కూడా ఉపయోగిస్తారు. ఆహార ఉత్పత్తులు, పాలు, నెయ్యి వంటి వాటిలో దీని వాడకం పూర్తిగా నిషేధం. ఇది జీర్ణాశయ సమస్యలు, కాలేయ వ్యాధులు, పేగులకు గాయాలు, దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

భోలేబాబా డెయిరీ డైరెక్టర్లు పొమిల్ జైన్, విపిన్ జైన్‌లు తిరుమలకు లక్షల కిలోల కల్తీ నెయ్యి తయారుచేసి సరఫరా చేశారు. దీని కోసం దిల్లీలోని అరిస్టో కెమికల్స్ నుంచి 8,900 కిలోల లాక్టిక్ యాసిడ్, లబ్సా/యాసిడ్ స్లర్రీ కొనుగోలు చేశారని సిట్ దర్యాప్తులో తేలింది. పామాయిల్, పామ్‌కెర్నెల్ ఆయిల్ లాంటి చౌక నూనెల్లో లబ్సా, లాక్టిక్ యాసిడ్ కలిపితే అచ్చు నెయ్యి లాంటి రూపు, రుచి, వాసన, క్రీమీనెస్ వస్తాయి. ఇలా రసాయనాల మిశ్రమాన్నే నెయ్యిగా తితిదేకు సరఫరా చేశారు.

సిట్ అభియోగపత్రంలో పేర్కొన్న వివరాల ప్రకారం, కల్తీ నెయ్యి తయారీకి 57.56 లక్షల కిలోల పామాయిల్, పామ్‌కెర్నెల్ ఆయిల్‌తో పాటు 8.90 లక్షల కిలోల ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్, లాక్టిక్ యాసిడ్ ఫుడ్ గ్రేడ్, మోనోగ్లిజరైడ్స్, లబ్సా వంటి రసాయనాలు కొనుగోలు చేశారు. ల్యాబ్ పరీక్షల్లో నెయ్యే అని తప్పుడు ఫలితాలు రావాలంటే, నెయ్యి వాసన వచ్చేలా చేయడానికి ఈ రసాయనాలు కలిపారు. రసాయనాల సరఫరాదారులను కూడా నిందితులుగా చేర్చారు.

ఒక సాధారణ డెయిరీకి వేల కిలోల లబ్సా అవసరం లేదు. కల్తీ నెయ్యి తయారీ కోసమే భోలేబాబా డెయిరీ లబ్సాను కొనుగోలు చేసినట్లు సిట్ గుర్తించింది. ఆహార భద్రత చట్టం-2006 ప్రకారం ఇలాంటి హానికర రసాయనాల వాడకం నిషేధితం. ఈ కేసులో భోలేబాబా డైరెక్టర్లు లక్షల కిలోల కల్తీ నెయ్యి తయారుచేసి తితిదేకు సరఫరా చేయడం ద్వారా భక్తుల ఆరోగ్యాన్ని, మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశారు.

సిట్ దర్యాప్తు మరింత లోతుగా కొనసాగుతోంది. ఈ ప్రమాదకర రసాయన వాడకం వెనుక ఉన్న అంశాలు మరిన్ని వెలుగుచూడనున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story