CM Chandrababu: అమరావతిలో ఈ నెలలోనే రెండు కీలక ప్రారంభాలు – చంద్రబాబు
చంద్రబాబు

CM Chandrababu: చట్టవ్యతిరేక చర్యలను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం మీడియాతో చర్చలు జరిపిన ఆయన, ప్రజలకు అసౌకర్యం కలిగించేలా బస్టాండ్లు, రహదారుల వెంట నిరసనలు చేస్తే ప్రభుత్వం నిశ్శబ్దంగా చూడదని హెచ్చరించారు.
గొడ్డలి పార్టీ నిరసనల్లో రౌడీలు, గంజాయ్ బ్యాచ్‌లు మినహా ఒక్క డీఎస్సీ అభ్యర్థి కూడా కనిపించడం లేదని ఆయన మండిపడ్డారు. కర్నూలులో ఇవాళ కదం తొక్కిన వారంతా మెగా డీఎస్సీ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులేనని పేర్కొన్నారు. ఆ పార్టీ చేస్తున్న నష్టం వల్లే ఉపాధ్యాయులు ఐక్యంగా తమ ఆత్మగౌరవాన్ని చాటుకున్నారని సీఎం అన్నారు.
ఆర్థిక వ్యవహారాలపై విడుదలైన శ్వేతపత్రం ప్రజల్లో బాగా చేరుకుందని చంద్రబాబు తెలిపారు. ఆ ప్రజెంటేషన్‌పై తాను పది గంటలు అధ్యయనం చేశానని, ఆర్థిక పరిస్థితిని ప్రజలకు వివరిస్తేనే వారు సరిగా అర్థం చేసుకుంటారని అన్నారు.
నెలాఖరు నాటికి రెండు ప్రధాన ప్రాజెక్టులు ప్రారంభమవుతాయని ప్రకటించారు. వెలిగొండ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అనకాపల్లి వరకు ఈ నెలలోనే పూర్తవుతాయి. వచ్చే ఏడాది ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని విశాఖపట్నం వరకు విస్తరిస్తామని చెప్పారు. అమరావతికి సంబంధించి ఈ నెలలోనే రెండు ముఖ్యమైన ప్రారంభాలు జరుగుతాయి. సీడ్ యాక్సిస్ ప్రారంభం, అలాగే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ అందుబాటులోకి రావడం వీటిలో ఉన్నాయి. వర్షాకాలంలో కూడా అమరావతి నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని సీఎం పేర్కొన్నారు.ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల రెండు రోజుల్లో శ్రీశైలం నిండిపోయి, ఆ తర్వాత నాగార్జునసాగర్‌కు కూడా నీరు చేరే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

