సమతుల బడ్జెట్‌ అంటున్న సీఎం చంద్రబాబు

Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. ఇది సమతులంగా, ముందుచూపుతో కూడిన బడ్జెట్‌ అని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్న బడ్జెట్‌ అని వ్యాఖ్యానించారు. భారతదేశాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంలో ఈ బడ్జెట్‌ కీలకంగా పనిచేస్తుందని, దేశాన్ని స్వావలంబనం వైపు నడిపిస్తుందని చెప్పారు. అన్ని ప్రాంతాలు, సమాజ వర్గాల అభివృద్ధికి ఇది దోహదపడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. భారత్‌ను అభివృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తిగా మార్చడంలో ఈ బడ్జెట్‌ ముఖ్య పాత్ర పోషిస్తుందని అన్నారు. రాబోయే రోజుల్లో సంస్కరణలను మరో స్థాయికి తీసుకెళ్లాలని సూచించారు.

ఇటీవల భారత్‌-ఈయూ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) లక్ష్యాల సాధనకు ఈ బడ్జెట్‌ సహకరిస్తుందని చంద్రబాబు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు. వారు స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక సుస్థిరాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్‌ను రూపొందించారని ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిన అంశాల్లో మరింత దూకుడుగా ముందుకు సాగడానికి ఈ బడ్జెట్‌ ఊతమిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లాలోని తన సొంత నియోజకవర్గం కుప్పంలో మూడు రోజుల పర్యటనలో భాగంగా, ఆదివారం శాంతిపురం మండలం తులసినాయనపల్లెలో విలేకరులతో మాట్లాడుతూ బడ్జెట్‌పై తన అభిప్రాయాలను పంచుకున్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక లబ్ధి

ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రం మీదుగా మూడు హైస్పీడ్‌ రైలు కారిడార్లు వెళ్తాయని తెలిపారు. చెన్నై-బెంగళూరు కారిడార్‌లో తిరుపతిని కూడా అనుసంధానించాలని కేంద్రాన్ని కోరతామని చెప్పారు. ఈ కారిడార్లలో హైదరాబాద్‌, అమరావతి, చెన్నై, బెంగళూరు నగరాలు ఉంటాయని, ఇవి అందుబాటులోకి వచ్చాక ఎక్కడికైనా సులభంగా ప్రయాణించవచ్చని అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇది డైనమిక్‌ జోన్‌గా మారుతుందని వ్యాఖ్యానించారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌, ఎంఎస్‌ఎంఈల ప్రోత్సాహం, బలోపేతానికి బడ్జెట్‌ ఉపకరిస్తుందని చెప్పారు. పేదరిక నిర్మూలనకు తాను తొలిసారిగా ప్రవేశపెట్టిన పీ-4 విధానం, వన్‌ ఫ్యామిలీ-వన్‌ ఆంత్రప్రెన్యూర్‌ వంటి కార్యక్రమాలకు ఇది దోహదపడుతుందని తెలిపారు. ప్రతి కుటుంబం ఒక ఎంఎస్‌ఎంఈ స్థాపించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని అన్నారు.

బడ్జెట్‌లో ఎస్‌ఎంఈ గ్రోత్‌ ఫండ్‌ కింద రూ.10 వేల కోట్లు కేటాయించారని, కార్పొరేట్‌ మిత్ర వ్యవస్థను ప్రారంభిస్తున్నారని చెప్పారు. ఎంఎస్‌ఎంఈలకు బ్యాంకులు ఇచ్చే రుణాల్లో 70 శాతం కేంద్రం, 25 శాతం రాష్ట్రం హామీ ఇస్తాయని తెలిపారు. స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌కు అవసరమైన జీఎస్టీ, కార్మిక సంస్కరణలు అమలు చేస్తున్నామని, నాలాను రద్దు చేశామని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి ప్రయత్నాలకు ఈ బడ్జెట్‌ వెసులుబాటు కల్పిస్తుందని స్పష్టం చేశారు.

రేర్‌ ఎర్త్‌, సెమీకండక్టర్‌లలో ఏపీ పాత్ర

మన దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఏఐలో నంబర్‌ వన్‌ స్థానంలో ఉన్నామని చంద్రబాబు అన్నారు. విద్యుత్‌ రంగంలో కూడా పురోగతి సాధిస్తున్నామని, యువ జనాభా మనకు ప్రత్యేక బలమని తెలిపారు. ఈ మూడు అంశాలను సద్వినియోగం చేసుకునేలా బడ్జెట్‌ రూపొందించారని ప్రశంసించారు. రేర్‌ ఎర్త్‌ కారిడార్‌లో ఆంధ్రప్రదేశ్‌ను చేర్చారని, ఇండియా సెమీకండక్టర్‌ మిషన్‌ 2.0ను ప్రారంభిస్తున్నారని చెప్పారు. దీనికి రూ.40 వేల కోట్లు కేటాయించారని, 2047 వరకు పన్ను మినహాయింపు కల్పిస్తున్నారని తెలిపారు. భారత్‌ డేటా సెంటర్‌ హబ్‌గా మారుతుందని, విశాఖపట్నంలో 10 గిగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్లు స్థాపించేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయని అన్నారు. డేటా సెంటర్లతో ఏఐ అభివృద్ధి వేగవంతమవుతుందని, త్వరలో ఏఐ విశ్వవిద్యాలయం ప్రారంభిస్తామని చెప్పారు. ఎన్విడియా వంటి ప్రముఖ కంపెనీలు ఇందులో భాగస్వాములవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ నెల 14 లేదా 15న మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ అమరావతిని సందర్శించనున్నారని ముఖ్యమంత్రి వెల్లడించారు. రైలు, మైన్‌, టూరిజం కారిడార్లతో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక లబ్ధి చేకూరుతుందని, రాష్ట్రాభివృద్ధికి ఈ బడ్జెట్‌ ఊపిరి పోస్తుందని చంద్రబాబు అన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story