Union Home Ministry: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి బిల్లు: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే ప్రవేశం
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే ప్రవేశం

Union Home Ministry: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియను ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సంబంధిత బిల్లును బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ తీవ్రంగా కసరత్తు చేస్తోంది.
కేంద్ర హోం శాఖ ముసాయిదా క్యాబినెట్ నోట్‌ను గృహ నిర్మాణ-పట్టణాభివృద్ధి శాఖ, న్యాయశాఖ, వ్యయ శాఖలు, నీతి ఆయోగ్‌తో పాటు సంబంధిత ఇతర శాఖలకు పంపి అభిప్రాయాలు కోరింది. న్యాయశాఖ ఇప్పటికే తన అభిప్రాయాన్ని తెలియజేసినట్లు సమాచారం. మిగిలిన శాఖలు త్వరగా అభిప్రాయాలు సమర్పించాలని హోం మంత్రిత్వశాఖ సూచించింది.
కేంద్ర మంత్రివర్గం ఆమోదం తర్వాత న్యాయశాఖ బిల్లు సిద్ధం చేస్తుంది. ఆ బిల్లును మళ్లీ క్యాబినెట్ ఆమోదించిన తర్వాత పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసి సమావేశాల్లోనే పూర్తి చేయాలనే లక్ష్యంతో కేంద్రం అడుగులు వేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం మొదటి 10 ఏళ్లు హైదరాబాద్ రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంది. ఆ కాలం 2024 జూన్ 2న ముగిసింది. అయితే, 2016 నుంచే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా పరిపాలన ప్రారంభించింది. విభజన చట్టంలో హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా పేర్కొనడంతో సాంకేతికంగా అమరావతికి చట్టబద్ధ హోదా ఇంకా కల్పించలేదు.
ఈ గడువు ముగియడంతో అమరావతిని రాజధానిగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని ఎన్నోసార్లు కోరింది. రాజధాని ఎంపిక విధానం, అక్కడి కార్యకలాపాలు, నిర్మాణ పురోగతి వంటి వివరాలతో నివేదిక సమర్పించింది. దీంతో అమరావతిని ఏ తేదీ నుంచి రాజధానిగా ప్రకటించాలో స్పష్టం చేయాలని కేంద్ర హోం శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగింది. ఉమ్మడి రాజధాని గడువు ముగిసిన 2024 జూన్ 2 నుంచే అమరావతిని రాజధానిగా ప్రకటించాలని రాష్ట్రం కోరింది.
ఈ నేపథ్యంలో కేంద్రం త్వరలో బిల్లు ప్రవేశపెట్టడం ద్వారా అమరావతికి చట్టబద్ధ హోదా కల్పించేందుకు దిశానిర్దేశం చేస్తోంది. ఇది రాష్ట్ర ప్రజలకు, అమరావతి అభివృద్ధికి కీలకమైన అడుగు కానుంది.

