YS JAGAN, Rajnath Sing : వైఎస్.జగన్‌కు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఫోన్
ఎన్‌డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్ధికి మద్దతివ్వాలని జగన్‌ని కోరిన కేంద్రమంత్రి

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్‌రెడ్డికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత రాజ్‌నాథ్‌సింగ్ సోమవారం ఉదయం ఫోన్ చేశారు. ఎన్‌డీఏ కూటమి ఎంపిక చేసిన ఉపరాష్ట్రపతి అభ్యర్ధి సీపీరాధాకృష్ణన్ ఎన్నికకు మద్దతివ్వాల్సిందిగా వైఎస్.జగన్‌ను కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కోరారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి పార్టీలో చర్చించి నిర్ణయం తసుకుంటామని వైఎస్.జగన్ కేంద్ర మంత్రికి స్పష్టం చేశారు. సీపీరాధాకృష్ణన్‌కు మద్దతుకు సంబంధించి తమ నిర్ణయాన్ని త్వరలోనే ప్రటిస్తామని కేంద్రమంత్రికి వైఎస్‌జగన్ చెప్పారు. అయితే ఉపరాష్ట్రపతి అభ్యర్ధిత్వానికి మహారాష్ట్ర గవర్నర్ సీపీరాధకృష్ణన్‌ను ఎన్‌డీఏ అభ్యర్ధిగా ఎంపిక చేయడం పట్ల తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి పార్టీలు కూటమి తరపున వేరే అభ్యర్ధిని ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలపాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలో ఎలాగైనా సీపీరాధాకృష్ణన్ ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ క్రమంలోనే వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్ మద్దతు కోరింది. అలాగే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జునఖర్గేతో పాటు ఇండియా కూటమిలో ఉన్న భాగస్వామ్య పార్టీల అధ్యక్షులతో కూడా బీజేపీ నేతలు సంప్రదింపులు చేస్తున్నారు. ఉపరాష్ట్రపతిగా సీపీరాధాకృష్ణన్ ఏకగ్రీవంగా ఎన్నికవడానికి సహకరించాల్సిందిగా విపక్ష పార్టీలను సైతం బీజేపీ నేతలు కోరుతున్నారు.
