Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టును ఈ నెల 31న ప్రారంభించి జాతికి అంకితం చేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా వెలిగొండ టన్నెళ్ల నుంచి 10.5 టీఎంసీల కృష్ణా జలాలను నల్లమల సాగర్‌కు విడుదల చేస్తారని ఆయన తెలిపారు.

ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో శనివారం వెలిగొండ నిర్వాసితులకు మూడో విడతగా 2,027 కుటుంబాలకు రూ.250 కోట్ల పరిహారాన్ని సీఎం చంద్రబాబు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మీడియాతో మాట్లాడుతూ, ప్రాజెక్టు అన్ని పనులు పూర్తి చేసి నిర్వాసితులకు పరిహారం చెల్లించిన తర్వాతే ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ప్రాజెక్టు కోసం భూములిచ్చిన త్యాగధనులకు పరిహారం ఇచ్చాకే నీళ్లు వదలాలని సీఎం చంద్రబాబు సూచించారని ఆయన పేర్కొన్నారు.

40 రోజుల్లోనే మూడు దశల్లో రూ.760 కోట్లు నిర్వాసితులకు పంపిణీ చేశామని, అధికారం చేపట్టిన రెండేళ్లలో ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వాసితులకు మొత్తం రూ.3 వేల కోట్లు అందజేశామని మంత్రి చెప్పారు. అర్హత ఉన్న చివరి నిర్వాసితుడికి కూడా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మొత్తం ఏడు నిర్వాసిత కాలనీల్లో నాలుగింటిలో 100 శాతం మౌలిక వసతులు పూర్తయ్యాయని, మిగిలిన మూడింటిలోని పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని తెలిపారు.

ప్రకాశం, కడప, నెల్లూరు జిల్లాల్లోని కరవు, ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు వెలిగొండ ప్రాజెక్టు వరం అని మంత్రి అన్నారు. దీని ద్వారా 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 23 లక్షల మందికి తాగునీరు అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మూడు దశాబ్దాల కలను సీఎం చంద్రబాబు నిజం చేస్తున్నారని ఆయన ప్రశంసించారు. ఎల్‌నినో వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా 10.5 టీఎంసీల జలాలను నల్లమల సాగర్‌కు తీసుకొస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్తులో వెలిగొండ నీళ్లతో ప్రకాశం జిల్లా సస్యశ్యామలం అవుతుందని ఆకాంక్షించారు.

గత ప్రభుత్వం నిర్వాసితులకు చెల్లించాల్సిన రూ.900 కోట్ల పరిహారంలో పైసా కూడా చెల్లించలేదని, పూర్తికాని ప్రాజెక్టును జాతికి అంకితం చేసి ప్రజలను మోసం చేశారని మంత్రి జగన్‌ను విమర్శించారు. నిర్వాసితులు మూడు దశాబ్దాల కల నెరవేరుతున్నందుకు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ చర్యలను స్వాగతించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story