Vemireddy Prashanthi Reddy: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వైఎస్సార్‌సీపీ నేతలు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్‌పై గురువారం తీవ్రంగా మండిపడ్డారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, తనపై వేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ ఆమె తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి నెల్లూరులో విలేకరులతో మాట్లాడారు.

2019 ఎన్నికల సమయంలో అనిల్‌కుమార్‌ యాదవ్ తన చిన్నాన్న రూప్‌కుమార్‌ యాదవ్‌ను వెంటబెట్టుకుని వచ్చి “మీరు శివపార్వతులు. ఎన్నికల్లో ఓడిపోతే రోడ్డున పడతాను. నా దగ్గర రూపాయి లేదు” అని వేడుకున్న విషయాన్ని గుర్తు చేశారు. వీపీఆర్‌కు దేశవ్యాప్తంగా రూ.50 వేల కోట్ల విలువైన మైనింగ్‌ కాంట్రాక్టులు ఉన్నాయని, ఇంకా 35 ఏళ్లకు సరిపడా వ్యాపారాలు చేతుల్లో ఉన్నాయని చెప్పారు. ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చిన వారికి దందాలు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

క్వార్ట్జ్‌ మైనింగ్‌ పేరుతో అనిల్‌ ఎవరెవరి దగ్గర ఎంతెంత దోచుకున్నారో తెలిపే 76 మంది జాబితా తమ వద్ద ఉందని ఆమె వెల్లడించారు. మైనారిటీల సంక్షేమానికి మంత్రి నారాయణ రూ.30 కోట్లు ఇస్తే వీపీఆర్‌ రూ.14 కోట్లు ఇచ్చారని, వారి పిల్లల చదువుల కోసం రూ.20 కోట్లతో పాఠశాల నిర్మిస్తున్నామని తెలిపారు. కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌ రెడ్డి తలమంచి, పంచేడు, రాజుపాలెం ప్రాంతాల్లో చేసిన అక్రమ మైనింగ్‌పై ఇంటెలిజెన్స్‌ నివేదికలు ఉన్నాయని, త్వరలో ఆయన అక్రమాలు బయటపడతాయని హెచ్చరించారు.

ప్రస్తుతం కోవూరులో ఎలాంటి అవినీతికి తావు లేదని, కలెక్టర్‌ సూచనల మేరకు నిబంధనల ప్రకారం పోతిరెడ్డిపాలెంలో ఇసుక అందుబాటులోకి తెచ్చామని స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ నాయకుల అసత్య ప్రచారాలు, కుట్రలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలే సమాధానం చెబుతారని ఆమె హెచ్చరించారు.

Next Story