Venkaiah Naidu: ఒంగోలు పురపాలక సంఘం ఏర్పాటై 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం స్థానిక మినీ స్టేడియంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ప్రస్తుతం ధన రాజకీయాలు పెరిగిపోయాయని, ఎన్నికల్లో గెలవడానికి భారీగా డబ్బు ఖర్చు చేస్తున్నారని, పాత రాజకీయాలను తిరిగి తేవాల్సిన అవసరం ఉందని అన్నారు.

గతంలో తాను ఒంగోలు నుంచి పోటీ చేసినప్పుడు అన్ని వర్గాల ప్రజలు రూ.200, రూ.300 చొప్పున ఖర్చులకు నగదు అందించిన సంగతి గుర్తు చేసుకున్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడినందుకు ఒంగోలు ప్రజలు తనను ఎంతో ఆదరించారని తెలిపారు. అభ్యర్థులను ఎన్నుకోవడంలో కులమతాలు చూడకూడదని, వారి వ్యక్తిత్వమే ప్రధానమని స్పష్టం చేశారు. ఒక ప్రాంత చరిత్ర భావి తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని అన్నారు.

ప్రసిద్ధి చెందిన ఒంగోలు గిత్త జాతిని బ్రెజిల్‌లో మరింత అభివృద్ధి చేసి ఇతర దేశాలకు అమ్ముతున్నారని, మనం మాత్రం కాపాడుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఒంగోలు 150 ఏళ్ల చరిత్ర పుస్తకాన్ని ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబుతో కలిసి ఆవిష్కరించారు.

కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ.. ఒంగోలుతో తనకున్న అనుభవాలను పంచుకున్నారు. ఒంగోలులో ఒక గంటలోనే తడి, పొడి చెత్తను వేరు చేసి రికార్డు సాధించడం గొప్ప విషయమన్నారు. గతంలో ఒంగోలు మీదుగా బకింగ్‌హామ్ కెనాల్ ద్వారా కాకినాడ-పుదుచ్చేరి జలరవాణా మార్గానికి నిర్ణయం తీసుకున్నా, అది అమలు కాకుండా పోయిందని, ప్రజాప్రతినిధులు దాని అమలుకు కృషి చేయాలని సూచించారు.

స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దనరావు మాట్లాడుతూ.. ఒంగోలు చరిత్ర ఈ తరం వారికి తెలిసేలా 20 మంది ప్రముఖుల విగ్రహాలను ఆవిష్కరించామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీలు మాగుంట శ్రీనివాసులరెడ్డి, భాష్యం రామకృష్ణ, మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవి, ఎమ్మెల్యేలు జనార్దనరావు, విజయకుమార్, ఉగ్రనరసింహారెడ్డి, అశోక్‌రెడ్డి, నాగేశ్వరరావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఛైర్‌పర్సన్ తేజస్విని, మైనారిటీ వ్యవహారాల సలహాదారు ఎం.ఎ.షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు కవుల రచనలు, నాటి తరం పాలకుల చిత్రాలతో ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేశారు.

ఒంగోలు గిత్తల ప్రదర్శనలో దాదాపు 200 గిత్తలను అలంకరించి నగర వీధుల్లో తీసుకెళ్లారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు హాజరై గిత్తల యజమానులకు బహుమతులు అందజేశారు. ఈ ప్రదర్శన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌కు ఎంపికైంది. రాత్రి జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో 150 మందితో కూచిపూడి నృత్య ప్రదర్శన అలరించింది.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్‌ వేదికగా శుభాకాంక్షలు తెలుపుతూ.. ‘‘ఒంగోలు గడ్డ అనగానే పౌరుషానికి ప్రతీకగా నిలిచే ఒంగోలు జాతి గిత్త కీర్తి, ఆంధ్ర కేసరి టంగుటూరి స్ఫూర్తి గుర్తుకొస్తాయి’’ అని కొనియాడారు. గత వైభవాన్ని స్మరించుకుంటూనే భవిష్యత్తు తరాలకు పరిశుభ్రమైన, పచ్చని, ఆధునిక నగరాన్ని అందించాలని పిలుపునిచ్చారు.

Next Story