Tirumala: తిరుమలలో వేంకటాద్రి నిలయం పీఏసీ-5 ప్రారంభం.. ఉపరాష్ట్రపతి, సీఎం చంద్రబాబు ఆవిష్కరణ
ఉపరాష్ట్రపతి, సీఎం చంద్రబాబు ఆవిష్కరణ
Tirumala: శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులకు సౌకర్యవంతమైన వసతి కల్పించేందుకు అత్యాధునిక వసతి సముదాయం వేంకటాద్రి నిలయం (పీఏసీ-5) ప్రారంభమైంది. ఈ సముదాయాన్ని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు సంయుక్తంగా ప్రారంభించారు. రూ.102 కోట్ల వ్యయంతో నిర్మితమైన ఈ కాంప్లెక్స్‌లో ముందస్తు బుకింగ్ లేకుండానే 4,000 మంది భక్తులకు ఉచిత వసతి సౌకర్యం అందుబాటులో ఉంటుంది.
ఈ సముదాయంలో 16 డార్మిటరీలు, 2,400 లాకర్లు, 24 గంటలూ వేడి నీటి సదుపాయం ఉన్నాయి. అలాగే, ఒకేసారి 80 మంది తలనీలాల సమర్పణకు వీలుగా కల్యాణకట్ట, 1,400 మంది భోజనం చేయగలిగే రెండు డైనింగ్ హాళ్లు ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబు, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌లు వసతి గృహం బుకింగ్ కౌంటర్‌ను పరిశీలించి, తొలి బుకింగ్ టోకెన్‌ను భక్తులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేశ్, ఆనం రామనారాయణరెడ్డి, అనగాని సత్యప్రసాద్, తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పాల్గొన్నారు.
