రహేజా సంస్థ రూ.2,172 కోట్ల పెట్టుబడులు

ఐటీ కంపెనీల కోసం వాణిజ్య, నివాస సముదాయాల నిర్మాణానికి ఆసక్తి


Raheja Group Invests ₹2,172 Crores: విశాఖపట్నం అభివృద్ధికి మరో గుడ్‌న్యూస్. ప్రముఖ నిర్మాణ సంస్థ కె.రహేజా కార్పొరేషన్ భారీ పెట్టుబడులు పెట్టనుంది. ఐటీ కంపెనీల అవసరాలకు వాణిజ్య, నివాస భవనాల సముదాయాలు నిర్మించేందుకు ఆసక్తి చూపింది. ఈ ప్రాజెక్టుకు రూ.2,172.26 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నట్లు సంస్థ ప్రతిపాదించింది. మధురవాడ ఐటీ హిల్ నంబరు-3లో 27.10 ఎకరాల భూమిని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ ప్రాజెక్టు అమలు ద్వారా సుమారు 9,681 మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని పేర్కొంది.

విశాఖలో గూగుల్ సంస్థ ఏఐ ఆధారిత డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయబోతోంది. దీనికి అనుబంధంగా భారీ సంఖ్యలో ఐటీ కంపెనీలు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా. వాటికి కార్యాలయాల జాగా అవసరం పడుతుంది. ఇప్పటికే మిలీనియం టవర్-1, 2లో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణాన్ని టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్ వంటి సంస్థలకు కేటాయించారు. కొత్తగా వచ్చే కంపెనీలకు అదనపు స్పేస్ అందించాలంటే రహేజా ప్రాజెక్టు ఎంతో ఉపయోగపడుతుంది. రెండు దశల్లో చేపట్టే ఈ ప్రాజెక్టు ద్వారా మొత్తం 28.65 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అందుబాటులోకి వస్తుంది.

దశలవారీ పనులు

మొదటి దశ: వాణిజ్య భవనాలు 2028 నాటికి, నివాస సముదాయాలు 2030 నాటికి పూర్తి చేయనున్నారు. ఈ దశకు రూ.663.42 కోట్లు ఖర్చు చేస్తూ 9.59 లక్షల చదరపు అడుగుల స్పేస్ అందిస్తారు.

రెండవ దశ: వాణిజ్య భవనాలు 2031 నాటికి, నివాసాలు 2035 నాటికి పూర్తయ్యేలా ప్లాన్ చేశారు. రూ.1,418.84 కోట్లతో 19.06 లక్షల చదరపు అడుగులు అందుబాటు చేస్తారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story