సేనతో సేనాని కార్యక్రమంలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు

ప్రజాస్వామ్యంలో హింస పనిచేయదని, జెండా కర్రే ఆయుధం, గుండెల నుంచి వచ్చే మాటే తూటా కావాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ జనసైనికులకు పిలుపునిచ్చారు. అలా చేస్తే కచ్చితంగా మార్పు వస్తుందని అన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కోసం దసరా తర్వాత త్రిశూల్‌ పేరుతో కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌కు స్థిరత్వం కావాలని, కూటమి సర్కారు బలంగా ఉండాలని కోరుకుంటున్నానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఏమైనా తప్పులు చేస్తే ప్రజలు, రాష్ట్రం నష్టపోతుందని హెచ్చరించారు. మళ్లీ అరాచక పాలన, చీకటి రోజులు వస్తాయని అన్నారు. జనసేన సిద్ధాంత ఆధారిత పార్టీ అని పవన్ కల్యాణ్ అన్నారు. అందరిలాగే తాను కూడా కష్టాల కొలిమి నుంచే వచ్చానని తెలిపారు. విశాఖ వేదికగా విశాఖ మున్సిపల్‌ స్టేడియంలో ‘సేనతో సేనాని’ పేరుతో మూడు రోజులపాటు జరిగిన జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు ముగిశాయి. జనసేన పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. నాయకులనే వారు కింద నుంచే రావాలని సూచించారు. తాము ప్రజాక్షేమం కోరుకుంటున్నాయని, భయపడేది ఉండదు పోరాటాలే ఉంటాయని అన్నారు. పేరంటాలకు వెళ్లాలి, అదే సమయంలో పోరాటాలు చేయాలని మహిళ కార్యకర్తలకు సూచించారు. వేదికపైన ఉన్న నాయకులకు కార్యకర్తల విలువ తెలియాలనే తాను ఈ సమావేశం పెట్టానని పవన్ కల్యాణ్ తెలిపారు.

పోరాటాల పురిటిగడ్డ తెలంగాణలో జనసేన పార్టీ ఆవిర్భవించిందని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. ఈ 11 ఏళ్ల ప్రయాణంలో ఏపీలో నిలదొక్కుకున్నామని, వందశాతం స్ట్రైక్‌రేట్‌తో దేశంలోనే చరిత్ర సృష్టించామని తెలిపారు. ఇంత మంది ఎమ్మెల్యేలతో నిలబడేందుకు తనకు పుష్కర కాలం పట్టిందని పవన్ కల్యాణ్ అన్నారు. పదవి, అధికారం అనే ఆశ లేకుండా మన దేశం, మన మూలాలను పరిరక్షించుకోవాలనే సంకల్పం కార్యకర్తలకు ఉంటే జనసేన కచ్చితంగా నేషనల్‌ పార్టీ అవుతుందని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఈ సందర్భంగా పార్టీకి సంబంధించిన ఐదు విషయాలను పవన్ ప్రస్తావించారు. పార్టీని సంస్థాగతంగా నిర్మించేందుకు పార్టీ కార్యాలయం నుంచి మండల స్థాయి వరకు మానిటర్ చేస్తానని పవన్‌ కల్యాణ్ ప్రకటించారు.

తాను ఎప్పుడూ నిస్వార్థంగానే పని చేసుకుంటూ వెళ్లానని, తన పని సత్ఫలితాలు ఇవ్వాలని కోరుకున్నానని పవన్ కల్యాణ్ అన్నారు. అందరూ బాగుండాలనేదే తన ఉద్దేశమని స్పష్టం చేశారు. కమ్యూనిజంను నినదించిన రష్యా ప్రజాస్వామ్య దేశంగా మారిందని పవన్ గుర్తు చేశారు. సెక్యూలరిజాన్ని తాము అర్థం చేసుకున్నామని అన్నారు. కమ్యూనిజం, సోషలిజం అన్ని అర్థం చేసుకున్న తర్వాతే పార్టీ ఏర్పాటు చేశామని తెలిపారు. సినిమాలు చేసి, డ్యాన్సులు చేసేవారికి అవగాహన ఉండదనుకుంటున్నారా అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. సంపూర్ణ అవగాహనతోనే తాము మాట్లాడామని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని అన్నారు. గుండెల్లో ఉండే మాటే తూటా కావాలని సూచించారు. చివరగా నిలబడేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉంటే వారి వెన్నంటి ఉండి, నడిపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పవన్ కల్యాణ్‌ ప్రకటించారు. తనకు దశాబ్దకాలం ఇస్తే నాయకులుగా, దేశనిర్మాణంలో కీలక శక్తులుగా తీర్చిదిద్దే బాధ్యత తాను తీసుకుంటానని కార్యకర్తలకు పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story