Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో మనీలాండరింగ్‌ కోణంలో దర్యాప్తు చేపట్టిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కీలక పరిణామం సృష్టించింది. ఈ కేసులో రూ.40 కోట్ల డీల్‌ జరిగిందనే అంశంపై దృష్టి సారించిన ఈడీ, ఇప్పటికే నలుగురు నిందితులను విచారించిన తర్వాత వైకాపా ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 14న విచారణకు హాజరుకావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది.

హత్య కేసులో అవినాష్‌రెడ్డి ఏ-7గా, ఆయన తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డి ఏ-8గా ఉన్నారు. ఈడీ అధికారులు వరుసగా కీలక నిందితులను ప్రశ్నిస్తూ ఉన్నారు. అప్రూవర్‌గా మారిన ఏ-4 దస్తగిరి, ఏ-3 సునీల్‌యాదవ్‌ల వాంగ్మూలాల ఆధారంగా సోమ, మంగళవారాల్లో ఏ-1 ఎర్రగంగిరెడ్డి, ఉమాశంకర్‌రెడ్డిలను సుదీర్ఘంగా విచారించారు.

2019 మార్చి 14 అర్ధరాత్రి వివేకా హత్య జరిగిన తర్వాత 15వ తేదీన ఎర్రగంగిరెడ్డి ఇంట్లో జరిగిన సమావేశం, అందులో పాల్గొన్నవారు, రూ.40 కోట్ల డీల్‌, వాటాల పంపకం వంటి అంశాలపై ఎర్రగంగిరెడ్డిని ప్రశ్నించారు. అలాగే హత్య తర్వాత ఉమాశంకర్‌రెడ్డి గోడ దూకి పారిపోతున్న సీసీ ఫుటేజీ, కాల్‌ డేటా, ఇతర ఆధారాలను ఎదుటపెట్టి విచారించినప్పుడు ఇద్దరూ కీలక సమాచారం అందించినట్లు తెలుస్తోంది. నగదు, బ్యాంకు లావాదేవీలపై కూడా ఆరా తీశారు.

ఈ వాంగ్మూలాల నేపథ్యంలో తాజాగా ఎంపీ అవినాష్‌రెడ్డికి నోటీసులు వెళ్లాయి. ఆయనతో పాటు తండ్రి భాస్కర్‌రెడ్డిని కూడా త్వరలో విచారణకు పిలిపించే అవకాశం ఉందని సమాచారం. వివేకా హత్య కేసులో మనీలాండరింగ్‌ కోణం మరింత ముమ్మరం కావడంతో రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి.

Next Story