Viveka Murder Case: వివేకా హత్య కేసు: అంతిమ లబ్ధిదారు జగనే – అనగాని సత్యప్రసాద్ ఘాటు వ్యాఖ్యలు
ఘాటు వ్యాఖ్యలు

Viveka Murder Case: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అంతిమంగా లబ్ధి పొందింది జగన్ మోహన్ రెడ్డేనని, ఈ కేసు దర్యాప్తు ఈడీ, సీబీఐ ముమ్మరం చేయడంతో తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదులుతున్నాయని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు.
మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, అప్రూవర్‌గా మారిన దస్తగిరి చెప్పిన నిజాలు, తాజాగా నిందితుడు సునీల్ యాదవ్ వెల్లడించిన వాస్తవాలు, రూ.40 కోట్ల సుపారీ లావాదేవీలు – ఇవన్నీ నేరుగా తాడేపల్లి ప్యాలెస్ వైపే వేలెత్తి చూపుతున్నాయని అన్నారు. వివేకా హత్యకు తాడేపల్లి ప్యాలెస్ వేదికగానే ప్రణాళిక రూపొందిందని సుస్పష్టమని ఆయన పేర్కొన్నారు.
“వివేకా హత్య కేసులో నిజాలు ఒక్కొక్కటిగా నిగ్గు తేలుతున్నాయి. జగన్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యుల పాత్రపై ఈడీ విచారణలో ఆధారాలు బయటకొస్తున్నందునే ప్రజల దృష్టి మళ్లించేందుకు డీఎస్సీ, ఇతర అంశాలపై డ్రామాలాడుతున్నారు” అని సత్యప్రసాద్ విమర్శించారు.
జగన్, ఆయన భార్య భారతి, సోదరుడు అవినాష్ రెడ్డి పేర్లు ఈ కేసులో బయటకు వస్తున్నాయని, రూ.40 కోట్ల సుపారీ వెనుకనున్న వాస్తవాలు బహిర్గతమవుతున్నాయని చెప్పిన మంత్రి, వీటన్నింటికీ జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సొంత బాబాయ్ గొడ్డలి పోటుకు గురైతే గుండెపోటుగా చిత్రీకరించిన చరిత్ర జగన్‌దేనని, అప్పట్లో చంద్రబాబుపై నెపం నెట్టాలని చూసినట్లే ఇప్పుడూ ప్రతి అంశంలోనూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
2019కి ముందు వివేకా హత్యపై సీబీఐ విచారణ జరపాలని కోరిన జగన్, దర్యాప్తు మొదలై కర్నూలు ఆసుపత్రి వద్దకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు అధికారులు వెళ్లగా బాంబులు వేస్తామని బెదిరించి, అధికారులపైనే అక్రమ కేసులు బనాయించి తరిమికొట్టిన విషయాన్ని ప్రజలు మరచిపోలేదని మంత్రి గుర్తు చేశారు. వివేకా హత్య కేసులో సాక్షులు వరుసగా అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోతుంటే ఐదేళ్లపాటు ఆ కుటుంబాలు తీవ్ర భయాందోళనలతో గడిపాయని, ఇప్పుడు దస్తగిరి, సునీల్ యాదవ్ తమకు ప్రాణహాని ఉందని భయపడుతున్నారని అన్నారు.
“బాబాయ్, తల్లి, చెల్లి… ఇలా ఎవరినైనా అధికారం కోసం వాడుకోవడమే జగన్‌కు తెలుసు” అని సత్యప్రసాద్ మండిపడ్డారు. అధికారం, అవినీతి సంపద కోసం జగన్ ఎంతటి ఘోరానికైనా పాల్పడుతారని విమర్శించారు. వైకాపా ‘గొడ్డలి డైవర్షన్ పార్టీ’గా పేరు మార్చుకోవాలని, జగన్ ఇప్పటికైనా మీడియా ముందుకు వచ్చి వివేకా హత్యపై వాస్తవాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు.

