Viveka Murder Case: మాజీ మంత్రి వై.ఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసులోని ఆర్థిక లావాదేవీల విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ2గా ఉన్న సునీల్ యాదవ్ శుక్రవారం ఈడీ అధికారుల ముందు హాజరై సంచలన విషయాలు వెల్లడించారు. హత్యకు సంబంధించిన సుపారీ ఒప్పందం, నిధులు సమకూర్చిన వ్యవహారం మొత్తం బయటపెట్టేందుకు సిద్ధమైన ఆయన, తన ప్రాణాలకు ముప్పు ఉందని, రక్షణ కల్పించాలని అధికారులను వేడుకున్నారు.

రెండో రోజు విచారణలో సునీల్ యాదవ్ కేసులోని ఆర్థిక రహస్యాలను ఒక్కొక్కటిగా విప్పారు. అధికారులు విచారణ వివరాలను అత్యంత రహస్యంగా ఉంచుతామని హామీ ఇవ్వడంతో, సుపారీ డీల్, నిధులు సమకూర్చిన పెద్దల గురించి పూర్తి సమాచారం అందించినట్లు తెలిసింది. పులివెందులలోని ఒక కీలక నేత ప్రధాన అనుచరుడి ద్వారా ఈ లావాదేవీలన్నీ నడిచాయని, అవి నగదు రూపంలోనే జరిగాయని ఆయన స్పష్టం చేశారు.

ఘటన జరిగిన వెంటనే తనకు రూ.కోటి అందిన విషయం నిజమేనని అంగీకరించిన సునీల్, ఆ మొత్తాన్ని డ్రైవర్ దస్తగిరికి అందజేశానని చెప్పారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఆధారాలను కూడా ఈడీకి సమర్పించినట్లు సమాచారం. ఈ సుపారీ వ్యవహారం, డబ్బుల పంపిణీకి సంబంధించిన పూర్తి వివరాలు తనతో పాటు ఏ1గా ఉన్న ఎర్రగంగి రెడ్డికి సమగ్రంగా తెలుసని ఆయన వెల్లడించారు. తామిద్దరి పర్యవేక్షణలోనే పంపిణీ ప్రక్రియ జరిగిందని, తాను, దస్తగిరి, ఉమాశంకర్ రెడ్డి కలిసి హత్య పథకాన్ని అమలు చేశామని వివరించారు.

నాలుగు గంటలపాటు సాగిన ఈ విచారణ తర్వాత, తదుపరి విచారణకు ఎప్పుడు పిలిచినా రావడానికి అభ్యంతరం లేదని సునీల్ తెలిపారు. ఆయన అందించిన సమాచారంతో నిధులు సమకూర్చిన అసలు సూత్రధారుల చుట్టూ ఈడీ ఉచ్చు బిగిస్తున్నట్లు కనిపిస్తోంది.

Next Story