CM Chandrababu Naidu: సీఎం చంద్రబాబు: ప్రతి ఎకరాకు నీటి సమృద్ధి.. సాగునీటి సంఘాలు ముందుండాలి!
సాగునీటి సంఘాలు ముందుండాలి!

కాలువలు, డ్రెయిన్ల నిర్వహణ బాధ్యత సాగునీటి సంఘాలదే
సాగునీటి సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షుల సమావేశంలో సీఎం ప్రసంగం
CM Chandrababu Naidu: రాష్ట్రంలోని ప్రతి ఎకరం భూమికీ సకాలంలో నీరందేలా సాగునీటి సంఘాల ప్రతినిధులు కృషి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పిలుపునిచ్చారు. కాలువలు, డ్రెయిన్ల నిర్వహణ, వారబందీ విధానాల అమలు సాగునీటి సంఘాల బాధ్యత అని స్పష్టం చేశారు. నీటి తీరువా వసూలు చేసి, ఆ నిధులను సంఘాలే ఖర్చు చేస్తే జలవనరులు మరింత బాగుపడతాయని వివరించారు. సాగునీటి సంఘాలు 'సైన్యం'లా పనిచేస్తే రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయవచ్చని అన్నారు.
అమరావతి రాజధానిలోని పరేడ్ మైదానంలో గురువారం (ఫిబ్రవరి 5, 2026) రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులతో నిర్వహించిన సమావేశంలో సీఎం మాట్లాడారు.
"రాష్ట్రంలో ప్రతి సాగునీటి సంఘానికి రూ.10 లక్షల వరకు నామినేషన్ పనులు చేసుకునే అవకాశం కల్పించాం. సంఘాలు ఉత్సాహంగా పనిచేస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.344 కోట్లతో 7,197 నిర్వహణ పనులు పూర్తి చేశారు. ఈ పనుల వల్ల జీఎస్టీ, పెన్షన్ వంటి సమస్యలు ఎదురవుతున్నాయని తెలిసింది. వాటన్నింటినీ తొలగిస్తాం" అని సీఎం ప్రకటించారు.
మే 15 నాటికి ఖరీఫ్ సాగు నారుమళ్లకు నీళ్లు ఇస్తామని, ఆ తర్వాత జూన్ నాటికి పొలాల్లో సాగు ప్రారంభించాలని సూచించారు. తుపాన్లు, వరదల వల్ల ఇబ్బందులు రాకుండా ఖరీఫ్ పంటలను త్వరగా పూర్తి చేసి, రబీ సాగుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
సాగునీటి సంఘాల ప్రతినిధులు ఇంజినీర్ల్లా ఆలోచించి, కొత్త ఆలోచనలతో ముందుకు రావాలని ఆయన కోరారు. రూ.10 లక్షలు ఇస్తే రూ.12 లక్షల పని చేసేలా ప్రయత్నించాలని సూచించారు. "ఒకప్పుడు రైతుల ఆత్మహత్యలకు కేంద్రంగా ఉన్న రాష్ట్రాన్ని ఇప్పుడు రైతు సానుకూల ఆంధ్రప్రదేశ్‌గా మారుస్తున్నాం" అని పేర్కొన్నారు.
పోలవరం-నల్లమల సాగర్ అనుసంధానం అవసరం
గోదావరి నుంచి ఏటా సగటున 2000 టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తోందని, పోలవరం నుంచి 200 టీఎంసీల నీటిని నల్లమల సాగర్‌కు తీసుకువచ్చి అనుసంధానం చేస్తే రాష్ట్రంలో కరవు ఉండదని చెప్పారు. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుకు అభ్యంతరం చెప్పకుండా, పోలవరం-నల్లమల అనుసంధానానికి కూడా ఎవరూ అభ్యంతరం చెప్పకూడదని వాదించారు. సముద్రంలోకి వెళ్లే నీటినే తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
డయాఫ్రం వాల్ విధ్వంసంతో రూ.1,000 కోట్లు వృథా
పోలవరం ప్రాజెక్టులో జగన్ హయాంలో రూ.440 కోట్లతో కట్టిన డయాఫ్రం వాల్‌ను నిర్లక్ష్యం చేయడంతో సర్వనాశనమైందని, దీంతో రూ.1,000 కోట్లు మళ్లీ ఖర్చు చేసి కొత్త వాల్ కట్టాల్సి వచ్చిందని విమర్శించారు. 2014-19 మధ్య సాగునీటి ప్రాజెక్టులకు రూ.68 వేల కోట్లు ఖర్చు చేశామని, ఆ ఫలితాలే ఇప్పుడు కనిపిస్తున్నాయని చెప్పారు.
రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు
రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును వైకాపా ప్రభుత్వం అనుమతులు లేకుండా నిర్మించడంతో జాతీయ హరిత ట్రైబ్యునల్ నిలిపివేసిందని, అది మన ప్రభుత్వం ఆపినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని తిరస్కరించారు. శ్రీశైలం జలాశయం నుంచి ముచ్చుమర్రి ద్వారా పోతిరెడ్డిపాడు లిఫ్ట్‌తో సీమ జలాశయాలకు నీళ్లు తీసుకువెళ్లవచ్చని వివరించారు.
ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని జలాశయాలు 91%, చెరువులు 65% నిండాయని, మొత్తం 846 టీఎంసీల నీటి నిల్వ ఉందని తెలిపారు. ఏడాదికి 1,300 టీఎంసీల నీటి అవసరం ఉందని సూచించారు.
సమావేశంలో సాగునీటి సంఘాల సభ్యుల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. మంత్రులు నిమ్మల రామానాయుడు, కందుల దుర్గేష్, అచ్చెన్నాయుడు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తదితరులు పాల్గొన్నారు.

