వైఎస్‌జగన్‌ భద్రతపై పీఏసీ సమావేశంలో చర్చించిన సభ్యులు



వ్యక్తిగత భద్రత విషయంలో ఆశ్రద్ధగా ఉండవద్దని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పొలిటికల్‌ అడ్వైజరీ కమిటీ సభ్యులు తమ పార్టీ అధినేత వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డిని కోరారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ పీఏసీ సమావేశం వైఎస్‌.జగన్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలతో పాటు పలువురు నేతలు వైఎస్‌.జగన్‌ భద్రత పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే చాలా ఆందోళనగా ఉంటోందని పీఏసీ సభ్యులు జనగ్‌ దృష్టికి తీసుకు వెళ్లారు. కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే జగన్‌ భద్రతపై సమస్యలు సృష్టిస్తోందని బొత్స, పెద్దిరెడ్డిలు అభిప్రాయపడ్డారు. ఈమధ్య కాలంలో మీరు చేస్తున్న ఏ పర్యటన చూసినా భద్రతా లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని జగన్‌ పర్యటనల పట్ల పీఏసీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. మొన్నీ మధ్య జరిగిన బంగారుపాళ్యం పర్యటనతో సహా అంతకు ముందు జరిగిన పలు పర్యటనల్లో భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం, పోలీసులు కావాలనే పట్టించుకోలేదని పీఏసీ సభ్యులు సమావేశంలో అభిప్రాయం వ్యక్తం చేశారు. మనవైపు నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పీఏసీ సభ్యులు వైఎస్‌.జగన్‌కు చెప్పారు. భద్రత విషయంలో రాజీ వద్దని పీఏసీ సభ్యులు వైఎస్‌.జగన్‌కు సూచించారు.

Updated On 29 July 2025 3:47 PM IST
Politent News Web 1

Politent News Web 1

Next Story