బయట గెలుస్తాం: వెంకయ్యనాయుడు

Venkaiah Naidu: దేశ ప్రజలు తమ కర్తవ్యాలను సక్రమంగా నిర్వహిస్తే భారత్ మరింత వేగవంతమైన అభివృద్ధి సాధిస్తుందని మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. ఇప్పటికే గణనీయమైన పురోగతి సాధించిన దేశం మరిన్ని మైలురాళ్లు అధిరోహించాలని ఆయన పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా గుడివాడలోని ఏఎన్‌ఆర్ కళాశాల వజ్రోత్సవ (డైమండ్ జూబిలీ) వేడుకల్లో ఆయన ప్రసంగించారు.

‘‘ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి సాధిస్తున్న దేశంగా భారత్ నిలిచిందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నివేదిక పేర్కొంది. అమెరికాలోని ప్రముఖ వైద్యుల్లో సగం మంది భారతీయులే. ఇంట గెలిచాం కాబట్టే బయట (రచ్చ) గెలుస్తున్నాం. సవాళ్లను గుర్తించి, వాటిని అధిగమించి ముందుకు సాగాలి. సంపద, సంక్షేమం ప్రతి ఒక్కరికీ అందేలా చూడాలి. ప్రస్తుతం 18 శాతం మంది ఇంకా దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నారు.. వారిని ఆదుకోవడం మన బాధ్యత’’ అని వెంకయ్యనాయుడు ఉద్బోధించారు.

దేశం ఆర్థికంగా, సామాజికంగా, దౌత్యపరంగా కొత్త యుగాన్ని ప్రారంభిస్తోందని ఆయన పేర్కొన్నారు. ‘‘తొమ్మిదేళ్ల క్రితం డిజిటల్ వినియోగం కేవలం 15 శాతానికి పరిమితమై ఉండగా.. నేడు ‘డిజిటల్ ఇండియా’ కార్యక్రమం ద్వారా 48 శాతానికి చేరింది. విద్యార్థులు ఈ డిజిటల్ ప్రపంచంపై మరింత శ్రద్ధ పెట్టి, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి’’ అని సూచించారు.

ఈ వేడుకల్లో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్, మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు, ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, కామినేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story